జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలం లో వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసక పాలన ప్రజలకు రుచి చూపించారు. అభివృద్ధి అంటే ఒక అడుగు కూడా ముందుకు పడకుండా ఓటు బ్యాంకు కొనుగోలు ఒక్కటే చాలన్నట్టుగా, డబ్బులు పంచిపెట్టడం ఒకటే జీవిత లక్ష్యం అన్నట్టుగా వ్యవహరించారు. ఇలాంటి సకల అరాచక దుర్మార్గాలతో పాటు ఉన్నత విద్యావ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారు. విశ్వవిద్యాలయాలను తన పార్టీకి, తన నాయకత్వానికి భజన మందిరాలుగా మార్చేశారు. రాష్ట్రంలోని ఉన్నత విశ్వవిద్యాలయాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల వీరవిధేయత కనబరిచే భక్తులను ఉపకులపతులుగా నియమించారు. అక్కడి నుంచి హద్దు అదుపు లేకుండా విచ్చలవిడిగా చెలరేగిపోతూ తమ తమ యూనివర్సిటీలను జగన్మోహన్ రెడ్డి అడ్డాలుగా మార్చి తరించిన వీసీలు ఇప్పుడు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. ఇలాంటి జగన్ భక్త ఉపకులపతులలో ఇప్పటికే 8 మంది రాజీనామాలు చేయడం విశేషం. అందరి రాజీనామాలు ఒక ఎత్తు అయితే విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ను జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతం చేయించిన ఘనమైన వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి కూడా రాజీనామా చేయడం మరో విశేషం!
ఆంధ్ర యూనివర్సిటీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మార్చేశారనే విమర్శలు అక్కడి వీసీ ప్రసాదరెడ్డి పై చాలా ఉన్నాయి. విద్యార్థులందరితోనూ జగన్ అనుకూల ప్రచారాలు చేయించారనే ఆరోపణ కూడా ఉంది. ఆయన స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పైగా ఆంద్ర యూనివర్సిటీ ఆస్తులను జగన్ దళాలకు అప్పనంగా వాడుకోవడానికి అనుమతించారనే విమర్శలూ ఉన్నాయి.
యూనివర్సిటీలో వైఎస్సార్ జయంతి, వర్ధంతి వేడుకలు, జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ద్వారా దాని ప్రతిష్ఠను దిగజార్చిన చరిత్ర ఆయనది. యూనివర్సిటీ నిర్వహణలో, పరిపాలన వ్యవహారాల్లో ఆయన తీరు మీద అనేక విమర్శలు ఉన్నాయి. చివరికి జగన్ ఓడిపోయిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటోలో కార్యాలయాల్లో ఏర్పాటుచేయాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ జగన్ ఫోటో తీయకుండా తన భక్తిని చాటుకున్న ప్రబుద్ధుడు ప్రసాద్ రెడ్డి. ఎట్టకేలకు ఆయన రాజీనామాతో ఆంధ్ర యూనివర్సిటీలోని విద్యార్థులు పండగ చేసుకుంటున్నారు.
ఇంటికి చేరుతున్న వివాదాస్పద ఉపకులపతులు!
Sunday, December 22, 2024