ఇప్పుడు ప్రజల తీర్పుతో తన పార్టీ బలం 11 ఎమ్మెల్యే స్థానాలకు పడిపోయింది. పాపం.. మండలిలోనైనా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు బ్రేకులు వేయవచ్చునని తలపోస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఆ అదృష్టం కూడా నిలిచేలా లేదు. మండలి కూడా వైసీపీ చేజారిపోతుందని ఆయన చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. మండలిలో తమ పార్టీకి ఉన్న మెజారిటీకి గండిపడడం ఎంతో దూరంలో లేదని.. త్వరలోనే మండలి కార్యకలాపాలను కూడా జగన్ కేవలం ప్రేక్షకుడిలాగా చూస్తూ ఉండాల్సిన రోజులు వస్తాయని పలువురు అంచనా వేస్తున్నారు.
తన పార్టీ తరఫున శాసనసభలో కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు అనే ఊహనే జగన్మోహన్ రెడ్డి భరించలేకపోతున్నారు. శాసనసభ సమావేశాలు మొదలవుతుండగా, ఆ 11 మందితో సన్నాహక సమావేశం పెట్టుకోవడం కూడా ఆయనకు అవమానం అనిపించింది. పార్టీ తరఫున పోటీ చేసిన మొత్తం 175 మందిని పిలిచి సమావేశం పెట్టుకున్నారు. ఎమ్మెల్సీలతో విడిగా సమావేశం పెట్టుకున్నారు. అంతే తప్ప ఎమ్మెల్యేలతో అలాంటి భేటీ జరగలేదు.
శాసన మండలిలో తమ పార్టీకి ఎక్కువ బలం ఉన్నదని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు, ప్రవేశపెట్టే బిల్లులకు మండలిలో బ్రేకులు వేస్తూ చెలరేగవచ్చునని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ఆ మేరకు మండల సభ్యులకు దిశా నిర్దేశం చేశారు కూడా. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీలు చాలామంది పార్టీ నుంచి బయటకు వెళ్లే ప్రమాదం ఉన్నదని సంకేతాలు వస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి తాజాగా నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో ఇదే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. మండలి సభ్యులు చాలామంది తెలుగుదేశంలో చేరడానికి సముఖంగా ఉన్నారనేది వారికి అందుతున్న సమాచారం.
అయితే పార్టీలో ఉండేవారు ఉంటారు పోయేవారు పోతారు.. విలువలు, నైతికత లేని వాళ్ళు వెళ్లిపోయినా మనమేం చేయగలం.. అంటూ జగన్మోహన్ రెడ్డి తాత్వికంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి బలవంతంగా నాయకులను తమతో కలుపుకున్నప్పుడు ఆయనలోని ఈ విలువలు, నైతికత అనే మాటలు ఎక్కడికి వెళ్లాయని ప్రజల ప్రశ్నిస్తున్నారు. మండలిలో కూడా తమ ప్రాభవానికి త్వరలోనే గండిపడుతుందని క్లారిటీ ఆయనకు ఉన్నదని.. దాన్ని ఏ రకంగానూ అడ్డుకునే ధైర్యం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. పార్టీకి మళ్ళీ బంగారు భవిష్యత్తు ఉంటుందనే నమ్మకాన్ని ఆయన ఎమ్మెల్సీలలో కలిగించలేక, వారు వెళ్లిపోయినా సరే ఆమోదించే స్థితికి దిగజారి పోయారని వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీని కాపాడుకోవడం చేతకాక పోవడం వల్లనే నైతికత, విలువలు గురించి సుద్ధులు చెబుతున్నారని అంటున్నారు.
మండలిలో పైచేయి జారిపోతుందని క్లారిటీ!
Wednesday, January 22, 2025