జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో.. నూతన లిక్కర్ విధానం తీసుకురావడం ద్వారా.. దాదాపు ముప్ఫయి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారనే ఆరోపణలు అప్పటినుంచీ వినిపిస్తూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక కేసులు నమోదు చేయించి సాగించిన సీఐడీ దర్యాప్తుల్లో లిక్కర్ పాలసీ ముసుగులో ఏ రకంగా దందా సాగించారో విస్మయానికి గురిచేసే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రాజంపేట ఎంపీ, జగన్మోహన్ రెడ్డికి పార్టీ వ్యవహారాలను కీలకంగా చక్కబెట్టే సహాయకుడిగా గుర్తింపు ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాత్ర కూడా బయటకు వచ్చింది. రాజ్ కసిరెడ్డి ద్వారా దందా మొత్తం నడిపిస్తూ.. మిథున్ రెడ్డే స్వయంగా దందాల సొమ్మును జగన్ కు చేరవేసేవారంటూ అనేక ఆరోపణలు వినిపించాయి. అయితే.. దేశంలోనే అత్యంత భారీ స్కామ్ గా భావిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ లో మిధున్ రెడ్డి పాత్రను నిర్ధరించేందుకు ఆయన వెనుక అసలు సూత్రధారులు, అసలు లబ్ధిదారుల సంగతి కూడా తేల్చేందుకు ఇప్పుడు రంగం సిద్ధం అవుతోంది. లిక్కర్ కుంభకోణం ఘోరాలు వెలుగులోకి వచ్చిన తొలినాటినుంచి తనను అరెస్టు చేస్తారని భయపడుతున్న మిథున్ రెడ్డి.. ముందస్తు బెయిలు కోసం పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింది. ఈ నేపథ్యంలో నేడో రేపో సీఐడీ పోలీసులు మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విచారణ అనంతరం.. అప్పటి పరిస్థితులను బట్టి ఆయన పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చవచ్చునని అనుకుంటున్నారు.
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పరిస్థితి గుమ్మడికాయల దొంగ అంటే బుజాలు తడుముకుంటున్న దొంగ మాదిరిగా తయారైంది. ఎందుకంటే.. లిక్కర్ కుంభకోణం కేసులు నమోదుచేసి కొందరిని విచారించిన నాటినుంచి మిథున్ రెడ్డి కూడా అరెస్టు భయంతో వణికిపోతున్నారు. ఇంతకూ సీఐడీ పోలీసులు ప్రాథమిక విచారణ తర్వాత చార్జిషీటు కూడా దాఖలు చేశారు గానీ.. మిథున్ పేరు నిందితుల్లో లేదు. ఆయనకు నోటీసులు కూడా ఇవ్వలేదు. ఆయన మాత్రం.. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు కావాలంటూ.. అతి జాగ్రత్తకు పోయి హైకోర్టును ఆశ్రయించారు. తాను పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాల్సి ఉందని.. కాబట్టి తనకు బెయిలు కావాలని కోర్టును కోరారు. తన తండ్రికి చేయి విరిగిందని పరామర్శకు వచ్చినా పోలీసులు అరెస్టు చేస్తారని భయాన్ని నటించారు. మొత్తానికి 3వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయవద్దని పోలీసుల్ని ఆదేశించిన కోర్టు.. చివరికి ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టేసింది.
కోర్టు పరంగా ఆటంకం తొలగినట్లయింది. అయితే మద్యం కుంభకోణంలో అసలు సూత్రధారి అయిన మిథున్ రెడ్డికి గడ్డు రోజులు ముందున్నాయని.. ఇతరుల వాంగ్మూలాలను బట్టి.. ఆయనను విచారించేందుకు సీఐడీ పోలీసులు త్వరలోనే ఆయనకు నోటీసులు సర్వ్ చేయనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. నోటీసులకు మిథున్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు.. విచారణకు వస్తారా లేదా? సహకరిస్తారా లేదా? అనేవన్నీ సందేహాలే! అప్పటి పరిస్థితులను బట్టి.. ఆ తర్వాత ఆయన పేరు నిందితుల జాబితాలో కూడా చేరుస్తారని పలువురు అంచనా వేస్తున్నారు.
నేడో రేపో పెద్దిరెడ్డి మిథున్ కు సీఐడీ నోటీసులు!
Wednesday, April 9, 2025
