సాక్షి దినపత్రిక మరియు సాక్షి టీవీ ఛానెళ్ల లోగోల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మను తొలగించి ఉండవచ్చు గాక. ప్రభుత్వ పథకాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తగిలించడం మానేసి.. తన సొంత పేరునే తగిలించుకోవడం జగన్ అలవాటుగా మార్చుకుని ఉండవచ్చు గాక! కానీ వైఎస్ఆర్ కు ఉన్న ప్రజాదరణ పునాదుల మీదనే ఆయన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఆధారపడి ఉన్నదని.. ఎప్పటికైనా ఎవ్వరైనా ఒప్పుకుని తీరాల్సిందే. జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టంతోనే ఆయన సీఎం అయ్యారని ఆయన వందిమాగధులు భజన చేయవచ్చు.. కానీ ఆ రెక్కలు వచ్చినది వైఎస్ఆర్ పుణ్యమే అని తెలుసుకోవాలి.
అలాంటిది వైఎస్ వారసుడిగా జగన్ క్లెయిం చేసుకుంటూ పొందుతున్న రాజకీయ లబ్ధికే గండిపడే పరిస్థితి వస్తోంది. ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టుగా.. వేరే వ్యవహారంలో బాలినేని శ్రీనివాసరెడ్డి , చెవిరెడ్డి భాస్కర రెడ్డి ల మధ్య సాగుతున్న సవాళ్లు ప్రతిసవాళ్ల పర్వం.. జగన్ కు ఉన్న వైఎస్సార్ వారసత్వ సేఫ్ జోన్ కే గండికొట్టే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఇద్దరు నేతల తగాదాలో జగన్ నష్టపోయే వాతావరణం కనిపిస్తోంది.
విద్యుత్తు ఒప్పందాల్లో అదానీనుంచి జగన్ తీసుకున్న 1750 కోట్ల రూపాయల ముడుపుల వ్యవభహారం, అప్పటి విద్యుత్తు మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించి.. తనకు సంబంధం లేకుండానే అప్పటి ఒప్పందాలు జరిగాయనే వాస్తవాల్ని వెల్లడించారు. బాలినేని విమర్శలపై పార్టీ మొత్తం సైలెంట్ గా ఉన్నప్పటికీ.. ఒంగోలులో ఎంపీగా తన విజయానికి సహకరించలేదనే దుగ్ధతో ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెరపైకి వచ్చారు. వైఎస్సార్ భిక్షతో రాజకీయ జీవితం గడుపుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారి విమర్శలు చేస్తున్నారంటూ, వైఎస్ కుటుంబానికి ద్రోహం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
దీనిపై బాలినేని స్పందిస్తూ.. చెవిరెడ్డి నాకు చెప్పేంతటి వాడేనా అంటూ ఫైర్ అవుతున్నారు. వైఎస్ కుటుంబం అంటే జగన్ మాత్రమేనా? వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ కాదా? అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇది చాలా పెద్ద వాదన. ఈ వాదన ప్రజల్లోకి వెళితే.. జగన్మోహన్ రెడ్డి పార్టీ యొక్క పునాదుల్లో ప్రకంపనలు వస్తాయని నమ్మాల్సిందే. వైఎస్ వారసుడు అనే కార్డు మీదనే జగన్ రాజకీయ జీవితం నడుస్తోంది.
ఆ మూలాలను ప్రశ్నించేలా.. వైఎస్ వారసత్వం జగన్ కు మాత్రమే ఎందుకు దక్కాలి.. విజయమ్మ షర్మిలలకు కూడా సమాన వాటా ఉంటుంది అనే వాదన వారి బంధువు, కుటుంబ సన్నిహితుడు అయిన బాలినేని ద్వారానే తెరపైకి తెస్తున్నారు చెవిరెడ్డి. బాలినేని మాటలు సామాన్య ప్రజల్లో కూడా అలాంటి ఆలోచనను పుట్టించాయంటే గనుక.. జగన్మోహన్ రెడ్డి రాజకీయ బలానికి ఖచ్చితంగా గండి పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.