‘‘జగన్ కోసం నేను, అమ్మ ఎంతో కష్టపడ్డాం. జగన్ కోసం రెండు ఎన్నికల్లో పాదయాత్ర చేశాను. చెల్లి కోసం ఇది చేశానని జగన్ జన్మలో ఒక్కటైనా చెప్పగలరా?’’ అని షర్మిల ప్రశ్నిస్తున్నారు. ఆమె ప్రశ్న ఎంతో సహేతుకంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అరెస్టు అయి జైల్లో పడిన సందర్భంలో అసలు ఆ పార్టీ మనుగడ సాధ్యమేనా? అనేతరహా అనుమానాలు పార్టీలోని అందరిలోనూ కలిగాయి. అలాంటి సమయంలో పార్టీని సజీవంగా ఉంచే బాధ్యతను షర్మిల తన భుజానికెత్తుకున్నారు.
ఆమె రెండు తెలుగు రాష్ట్రాలలో పాదయాత్ర చేశారు. తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్నారు. జగన్ జైలు నుంచి బయటకు వచ్చే వరకు పార్టీని షర్మిల కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చారని చెప్పాలి. మరి ఆ స్థాయిలో కాకపోయినా.. కనీసం ఏదో ఒక స్థాయిలో చెల్లెలికోసం నేను ఫలానా చేశాను అని చెప్పగల స్థితిలో జగన్ ఉన్నారా? ఆ ప్రశ్నే చాలా కామెడీగా అనిపిస్తుంది.
వైఎస్ కుటుంబానికి చెందిన ఆస్తుల్లో ఆమెకు న్యాయంగా దక్కవలసిన వాటాలు పంచుతూ కేవలం ఎంఓయూ మాత్రం జగన్ రాసుకున్నారు. అది కూడా ఇప్పుడు వెనక్కు తీసుకుంటానని అంటున్నారు. చెల్లెలి ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయని అనుకుని అవన్నీ ఇచ్చానని, అవి లేవు గనుక.. వాటిని రద్దు చేయాలనే విచిత్రమైన వాదన ఆయన తెస్తున్నారు. ‘చెల్లి కోసం జగన్ ఏం చేశాడు’ అనే ప్రశ్నకు తాను ఎంఓయూ రూపంలో ఇచ్చిన వాటాలను ప్రస్తావించే స్థితిలో జగన్ లేడు.
అలా మాట్లాడితే గనుక.. ఆమెకు ఆస్తుల ఎర వేసి.. ఆమెతో ఎన్నికల ప్రచారం చేయించుకున్నట్టుగా ప్రజలు గుర్తిస్తారు. పైగా ఇప్పటిదాకా ప్రేమకోసం, ఆప్యాయత కోసం ఇచ్చానని కల్లబొల్లి కబుర్లు చెప్పి.. ఇప్పుడు మాట మారిస్తే ఆయన పరువే పోతుంది. కాబట్టి షర్మిల తన ఒకే ఒక్క ప్రశ్నతో అన్నను డిఫెన్సులోకి నెట్టేశారు.
ఇదొక ఎత్తు అయితే.. ‘‘కన్న తల్లిని కుమారుడే కోర్టుకు లాగడం దారుణం కాదా? ఇవన్నీ చూడడానికే బతికున్నానా? అని నా తల్లి విజయమ్మ బాధపడుతోంది’’ అంటూ షర్మిల ఉద్వేగభరితంగా చెబుతున్న మాటలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.