యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో ఎవరో రిజిస్టర్ చేసుకున్న రాజకీయ పార్టీని తాను హస్తగతం చేసుకుని.. అదేదో తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి స్మృత్యర్థం స్థాపించిన పార్టీ లాగా బిల్డప్ ఇస్తూ ప్రజల్లో తన పట్ల మోసపూరిత ఆదరణను నిర్మించుకున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి! ఆ రకంగా ఆయన పార్టీ పుట్టుకలోనే ఒక అబద్ధం, ఒక మోసం దాగి ఉన్నాయి. కానీ వైయస్సార్ బొమ్మను వాడుకోవడం ద్వారా- అది ఆయన స్మృతి కోసం పెట్టిన పార్టీ అన్నట్లుగా ఇప్పటికీ ప్రజలను నమ్మిస్తున్నారు. ఆ పార్టీకి వైయస్ రాజశేఖర్ రెడ్డి జనాదరణ- ఆత్మ లాగా ఉంటున్నది. ఆ ఆత్మను కూడా ఆ పార్టీ నుంచి దూరం చేసే లాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెమ్మ షర్మిల తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని షర్మిల అంటున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలును పూర్తిగా తుంగలో తొక్కడం వల్లనే ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీని గొయ్యి తీసి పాతి పెట్టారని షర్మిల విమర్శిస్తుండడం గమనార్హం.
ఇదేమీ ఆమె తన రాజకీయ ప్రయోజనాల కోసం చెబుతున్నట్లుగా కనిపించడం లేదు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం వైయస్ ఆశయం అని షర్మిల పదేపదే అంటుంటారు గానీ, ఆ కోణంలో జగన్ ను నిందించడం లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన జన యజ్ఞాన్ని జగన్ విస్మరించారని, ఆయన శ్రీకారం చుట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో 4 వేల కోట్లు బకాయిలు పెట్టారని, ఆయన తెరదించేసిన హత్యా రాజకీయాలు, గుండాయిజాన్ని తిరిగి ప్రోత్సహించారని ఆ రకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తి కి- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా చేశారని విమర్శిస్తున్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి కి విశాఖ స్టీల్ ప్లాంటు అంటే చాలా ఇష్టం అని తెలిసి కూడా దానిని కాపాడేందుకు ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ప్రయత్నించకపోవడాన్ని షర్మిల తప్పుపడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి తోక పార్టీగా వైసీపీని అభివర్ణిస్తున్న షర్మిల మాటలతో వైసిపి ఇరుకున పడుతోంది. అసలే అత్యంత దారుణంగా ఓడిపోయి కష్టాల్లో ఉన్న పార్టీకి ప్రజాదరణలు మరింత దిగజారిచేలా షర్మిల మాటలు పుండు మీద కారం రాసినట్లుగా ఉన్నాయని ఆ పార్టీ వారు బాధపడుతున్నారు.
వైసిపి ఆత్మను దూరం చేస్తున్న చెల్లెమ్మ!
Tuesday, January 21, 2025