రాష్ట్రంలోని కొన్ని వర్గాల ప్రజలకు ప్రతినెలా కొంత సొమ్ము నేరుగా చేరవేస్తే చాలు.. రాష్ట్రం ఎలా నాశనం అయిపోయినా పర్లేదు.. తనకు స్థిరమైన ఓటు బ్యాంకు తయారవుతుంది… తాను ఎప్పటికీ ముఖ్యమంత్రిగా నెగ్గుతూనే ఉంటాను అనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. చంద్రబాబునాయుడు చెబుతున్న ‘సంపద సృష్టి’ అనే పదానికి అర్థం ఏమిటో తెలియకుండా, దానిని ఎలా సాధిస్తారో నేర్చుకునే ప్రయత్నం చేయకుండా, సంపద సృష్టి జరిగేలా రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే వాతావరణం కల్పించకుండా.. ప్రతినెలా తలకు మించిన భారంగా మారుతున్న డబ్బుల పందేరం కోసం.. అప్పులు తెస్తూ బండినడిపిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. పన్నులు కట్టే ఉద్యోగులకు జీతాలు మూడు నాలుగువారాల్లో ఇస్తూ.. ఉచితంగా పథకాలు పొందేవారికి ఒకటోతేదీనే చెల్లిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఆయన. అయితే అలా పంచిపెడుతున్న సొమ్ముల కోసం.. ప్రతినెలా వందల కోట్లు అప్పులు తెస్తూ రాష్ట్రాన్ని ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి ముంచేశారనే సంగతి కూడా అందరికీ తెలుసు. అప్పులు తేవడం కోసం రాష్ట్రప్రభుత్వపు సకల ఆస్తులను ఆయన తాకట్టు పెట్టేశారు. చాలా వరకు ఆస్తులను అమ్మేశారు. చివరకు చంద్రబాబునాయుడు కట్టించిన సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు.
అచ్చంగా రోజు వారీ బండి నడవడానికి రాష్ట్రంలోని ఏదో ప్రభుత్వాస్తిని తాకట్టుపెట్టడమో లేదా విక్రయించడమో జరిగితే తప్ప.. సాధ్యం కాదు అనే పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి దుస్థితి గురించే ఆయన చెల్లెలు షర్మిల ఒక రేంజిలో ఫైర్ అవుతున్నారు. జగన్ కు పరిపాలన అంటే తెలియదని అంటున్న షర్మిల.. ఉద్యోగాల కల్పన, ప్రత్యేక హోదా తదితర విషయాల్లో జగన్ రాష్ట్రప్రజలను దారుణంగా మోసం చేశారని దుమ్మెత్తిపోస్తున్నారు. కుంభకర్ణుడైనా ఆరునెలలకు ఒకసారి నిద్రలేస్తాడుగానీ.. నాలుగున్నరేళ్ల తర్వాత నిద్రలేసిన జగన్.. తూతూమంత్రంగా ఒక డీఎస్సీ డ్రామా నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు.
జగన్ ను మళ్లీ గెలిపిస్తే.. పథకాలకు డబ్బులు సమీకరించడం కోసం అమ్మడానికి ఇక ప్రభుత్వ ఆస్తులేమీ లేవని.. రాష్ట్ర ప్రజల్ని కూడా అమ్మేస్తారని ఆమె అంటున్నారు. ఓటు వేుస్తే మిమ్మల్నే అమ్మేస్తారు అంటూ ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. తన ఎంపీ నియోజకవర్గం పరిధిదాటి పలమనేరులో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన పీసీసీ సారథి షర్మిల జగన్ పాలనపై విమర్శలను మరింత ఘాటుగా సంధిస్తుండడం విశేషం.
జగన్ తాకట్టులు, అమ్మకాలపై చెల్లెమ్మ నిప్పులు!
Thursday, November 21, 2024