జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తమ ప్రత్యర్థి పార్టీలను ఎన్నిరకాలుగా వేధించగలరో అన్ని రకాలుగానూ ఇబ్బంది పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఏదో ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు కదా అని దానిని సద్వినియోగం చేసుకోవడానికి జగన్ సర్కారు ప్రయత్నించలేదు. ఆ రకంగా తాము స్థిరపడాలని అనుకోలేదు. తమ రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడం ద్వారా తాము నిలదొక్కుకోవాలని అనుకున్నారు. రకరకాల కేసులు పెట్టి.. ప్రత్యర్థి పార్టీ ప్రముఖులందరినీ కటకటాల పాల్జేస్తే తమకు ఎదురుండదని కుట్రలు చేశారు. ఆ కుట్రలకు ఇప్పుడు తెలుగుదేశం సర్కారు మంగళగీతం పాడబోతోంది.
జగన్ సర్కారు పరిపాలన సాగిస్తున్న రోజుల్లో తెలుగుదేశం వారిపై ఎడాపెడా కేసులు పెట్టారు. అక్రమ కేసులు బనాయించడమే వారి పనిగా చెలరేగిపోయారు. స్కిల్ డెవపల్మెంట్ కేసు తరహాలో అధినేత చంద్రబాబునాయుడు మీద పెట్టిన కేసులు, చేసిన అరెస్టులు ఒక రకం దుర్మార్గం మాత్రమే. అక్కడితో ప్రారంభించి క్షేత్రస్థాయిలో చిన్న చిన్న కార్యకర్తల వరకు అందరి మీద అనేక రకాల కేసులను జగన్ సర్కారు బనాయిస్తూ పోయింది. జగన్ పార్టీ వారు కుట్రపూరితంగా పెట్టించిన క్రిమినల్ కేసుల దెబ్బకు తెదేపా కార్యకర్తలు పలువురు తమ ఊర్లను వదలి పరారై పోయారంటే అతిశయోక్తి కాదు.
ఇలాంటి అరాచక కేసులు అన్నింటినీ సమీక్షించి పునర్నిర్ణయం తీసుకునే ప్రక్రియ ప్రారంభిస్తున్నది చంద్రబాబునాయుడు ప్రభుత్వం. తెలుగుదేశం ప్రముఖులు అందరిమీద ప్రభుత్వపరంగా పెట్టిన కేసులన్నీ ఇప్పుడు విచారణలో రకరకాల దశల్లో ఉన్నాయి. వాటన్నింటినీ.. సమీక్షించనున్నారు. ఆ కేసుల్లో సహేతుకతను నిగ్గు తేల్చనున్నారు. ఆ తర్వాత ఆయా కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.
ఈ క్రమంలో.. నాయకుల మీద ఉన్న సీరియస్ కేసుల కంటె ముందుగా.. పార్టీ దిగవస్థాయి శ్రేణులు, కార్యకర్తల మీద ఉన్న కేసులను సమీక్షించాలని పార్టీ తలపోస్తోంది. ముందుగా కార్యకర్తలను కింది స్థాయి నాయకును కేసులనుంచి విముక్తులను చేసిన తర్వాత.. రాష్ట్రస్థాయి నాయకుల మీద ఉన్న కేసులను పరిశీలించాలని చూస్తున్నారు. ఇలాంటి ఆలోచన పట్ల పార్టీలోనే హర్షం వ్యక్తం అవుతోంది.