ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన పర్వంలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా అతి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తు దృష్ట్యా కూడా పార్టీ సుస్థిరంగా అధికారంలో ఉండేలాగా పనిచేయాలని ఆయన తపన పడుతున్నారు. అందుకు తగ్గట్లుగానే పార్టీ నాయకులందరికీ కూడా దిశా నిర్దేశం చేస్తున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడితే ఎలాంటి వారినైనా సహించేది లేదని ఆయన పదేపదే చెబుతూ వస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు పట్ల తెలుగు తమ్ముళ్లకు ఖాతరు లేదా అనే అనుమానం ఇప్పుడు రాజకీయ వర్గాలలో కలుగుతోంది.
ఉచిత ఇసుక అనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించిన ఒక అద్భుతమైన వరం. రాష్ట్రంలో ప్రతి సామాన్యుడి నుంచి, గొప్ప వారి వరకు ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపించగలిగే ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వానికి సుస్థిరమైన మంచి పేరు తెచ్చుకోవాలని చంద్రబాబు నాయుడు తపన పడుతున్నారు. ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించిన తర్వాత అందులో ఎమ్మెల్యేలు గానీ, స్థానిక నాయకులు గానీ ఎవ్వరు జోక్యం చేసుకోవద్దు అని ఆయన పదేపదే హెచ్చరించారు. అయితే ఆయన హెచ్చరికలు గాలికి పోయినట్లుగా కనిపిస్తున్నాయి. తిరుపతి జిల్లా ఏర్పేడు మండల పరిధిలో ఇసుక తరలిస్తున్న ప్రతి ట్రాక్టర్ కు 500 రూపాయల వంతన స్థానిక నేతలు దందా వసూలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలు రాసినందుకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈనాడు విలేఖరి పై ఆగ్రహించి తాట తీస్తానని బెదిరించడం ఈ వ్యవహారంలో కొసమెరుపు. నియోజకవర్గ పరిధిలో నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని వార్తలు వస్తే.. ఎమ్మెల్యేలు మేలుకొని పరిస్థితిని చక్కదిద్దుకోవాలి కానీ.. విలేకరుల అంతు చూస్తానని బెదిరించడం అనేది అనూహ్యమైన సంగతి! మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బొజ్జల సుధీర్ రెడ్డి తన ప్రవర్తనతో ప్రజలలో పలుచన అవుతున్నారని పలువురు భావిస్తున్నారు.