నామినేటెడ్ పదవుల పంపకం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మూడు పార్టీలు కలిసి కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉన్న నేపథ్యంలో.. నామినేటెడ్ పదవుల పంపకం అనేది ఏ ఒక్క పార్టీలో కూడా అసంతృప్తి పుట్టించకుండా సాఫీగా సాగిపోవాలనేది ఆయన వ్యూహంగా ఉంది. ఎన్నికలకు ముందు నుంచి కూడా జనసేన, భారతీయ జనతా పార్టీలతో కలిసి తెలుగుదేశం ఏర్పాటు చేసుకున్న జట్టు మంచి సమన్వయంతో అడుగులు వేసింది. ఎన్నికల సీట్ల పంపకాల సమయంలో జనసేనకు 21, భారతీయ జనతా పార్టీకి 10 స్థానాలు కేటాయించినప్పుడు ఎలాంటి అసంతృప్తి వ్యక్తం కాకుండా ఆ పార్టీలు ఎన్నికలకు వెళ్లడం ఇందుకు ఒక గొప్ప చిహ్నం. కూటమి రాష్ట్రంలో తిరుగులేని విజయాన్ని సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా మూడు పార్టీల మధ్య అదే సమన్వయం కొనసాగుతూ వస్తోంది. ఇప్పటిదాకా ప్రత్యర్థులు వేలెత్తి చూపగల ఎలాంటి పరిణామం లేకుండా పరిపాలన సాగుతోంది. కూటమి ఐక్యత ప్రతిపక్షాలకి మింగుడు పడడం లేదు కూడా.
ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ నామినేటెడ్ పదవుల పంపకం విషయంలో కూడా ఏ ఒక్క పార్టీలో అసంతృప్తి రాకుండా ఆ పర్వం పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. ఎన్నిక ల సమయం ఏ దామాషాలో అయితే సీట్లు పంచుకున్నామో.. అదే దామాషాలో నామినేటెడ్ పోస్టుల కేటాయింపు కూడా ఉండాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అదే సంకేతాలు రెండు పార్టీల అధినేతలకు పంపి, ఆ మేరకు పదవుల కోసం పేర్లను సిఫారసు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆయా పార్టీలకు ఉండే బలాబలాల కొలబద్దల మీద గతంలో సీట్ల పంపకం జరిగిన నేపథ్యంలో.. ఈ ప్రతిపాదనకు కూటమి పార్టీల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కావడం లేదు.
నామినేటెడ్ పోస్టుల్లో భాగస్వామ్య పార్టీలు జనసేన, భారతీయ జనతా పార్టీలకు కలిపి 18 నుంచి 20 శాతం వరకు కేటాయించాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. మరో 10 రోజుల్లోగా రాష్ట్రంలో కీలకమైన నామినేటెడ్ పోస్టుల తొలివిడత పందేరం పూర్తవుతుంది అని వార్తలు వస్తున్నాయి. నాయకుల్లో అసంతృప్తి రాకుండా నామినేటెడ్ పదవుల పంపకం సాఫీగా జరిగిపోతే చంద్రబాబు ప్రభుత్వం ఒక కీలకమైన ఘట్టం దాటినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
అసంతృప్తి రాకుండా చంద్రబాబు నామినేటెడ్ వ్యూహం!
Tuesday, November 12, 2024