డబుల్ బొనాంజా అన్నట్టుగా డబుల్ భరోసా ఇస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు! ఆయన ఇస్తున్న భరోసాతో అమరావతి ప్రాంత రైతులు హర్షాతిరేకాల్లోమునుగుతున్నారు. ఇంతకూ ఆయన చెబుతున్న డబుల్ భరోసా ఏమిటో తెలుసా.. అమరాతి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉంటుందని ధ్రువీకరించడం, దీనికి సంబంధించి కేంద్రప్రభుత్వంతో కూడా సానుకూల ధోరణితో వ్యవహరించి.. పార్లమెంటులో బిల్లుద్వారా నోటిఫై చేయించడం ఒక భరోసా. అలాగే.. విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ వంటివాటికి మరో 44 వేల ఎకరాలు సమీకరణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ.. వాటివలన తొలుత అమరావతికి రైతులిచ్చిన 39 వేల ఎకరాల్లో రిటర్నబుల్ ప్లాట్లకు ధర ఏమౌతుందో అనే ఆందోళన అనవసరం అని.. ఇవన్నీ వస్తే వాటి ధరలు మరింతగా పెరుగుతాయని తెలియజెప్పడం- రెండో భరోసా!
అమరావతి ప్రాంతంలో లక్ష కోట్ల రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టబోతున్న సమయంలో బాబు సర్కార్ రాజధానికోసం మరింత బృహత్ ప్రణాళిక సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఐదువేల ఎకారల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, 1600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని ప్లాన్ చేశారు. ఆ స్పోర్ట్స్ సిటీ సాకారం అయితే అది దేశంలోనే అతి పెద్ద క్రీడానగరం అవుతుంది. భారతదేశానికే అమరావతిని స్పోర్ట్స్ రాజధానిగా తయారుచేస్తాం అంటూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్న ప్రకటించారు కూడా.
ప్రభుత్వం ఈ ఆలోచనలు చేసిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ నీలిదళాలు రంగంలోకి దిగాయి. అమరావతి ఎక్స్ టెన్షన్ జరిగితే.. తొలుత భూములిచ్చిన రైతులకు దక్కే స్థలాల విలువ పడిపోతుందంటూ.. వారు బూటకపు ప్రచారంతో రైతుల్ని భయపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ప్రచారం అబద్ధం అని, స్మార్ట్ పరిశ్రమలు వస్తేనే.. భూముల విలువ బాగా పెరుగుతుందని.. అలాటివి రావాలంటే.. అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం అని మంత్రి నారాయణ పలుమార్లు నచ్చజెప్పారు.
పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కొన్ని గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించి.. దాదాపు 9వేల ఎకరాలకు పైగా సమీకరణ ద్వారా ఇవ్వడానికి రైతులనుంచి ఆమోదం కూడా ప్రకటింపజేసిన తర్వాత.. కొత్త రాజధాని ఆలోచనలకు మరింత ఊపు వచ్చింది. ఈ నేపథ్యంలో తొలుత స్థలాలు ఇచ్చిన రైతులతో ప్రత్యేకంగా సమావేశం అయిన చంద్రబాబు వారికి మరింత భరోసా ఇచ్చారు. మీ భూముల విలువ మరింత పెరగడం కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా వెల్లడించారు.
మే2వ తేదీన అమరావతి పునర్నిర్మాణ పనులకు జరిగే శంకుస్థాపనకు రైతులందరూ కుటుంబాలతో సహా హాజరు కావాలని చంద్రబాబు వారిని కోరారు. మొత్తానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి డబుల్ భరోసాతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
అమరావతి రైతన్నలకు చంద్రబాబు డబుల్ భరోసా!
Friday, December 5, 2025
