ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వానికి నలుగురు గౌరవ సలహాదారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివిధ రంగాల్లో నిష్ణాతులు అయిన నలుగురు ప్రముఖులను కేబినెట్ హోదాతో సలహాదార్లుగా నియమించారు. వీరిలో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇస్రో మాజీ ఛైర్మన్ శ్రీధర్ ఫణిక్కర సోమనాథ్, ఏరోస్పేస్ డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ కి కేంద్ర రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి, చేనేత హస్తకళల అభివృద్ధికి భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల, ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి ప్రముఖ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను గౌరవ సలహాదారులుగా నియమించారు. వీరు రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు. కాగా, ఈ నలుగురి నియామకం ద్వారా.. ప్రభుత్వ సలహాదారు అనే పదానికి చంద్రబాబునాయుడు ఒక గౌరవం తీసుకువచ్చారని అందరూ అభిప్రాయపడుతున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలంలో ప్రభుత్వ సలహాదారు అనే పదవి.. కేవలం ఒక పునరావాస కార్యక్రమంలాగా తయారైంది. తన తొత్తులు, తైనాతీలు, తనకు కాళ్లు పట్టేవారు, కాళ్లు మొక్కేవారు.. అడ్డదారుల్లో తనకు సేవలు అందించే వారు, తన వ్యాపార సంస్థల్లో ఉద్యోగాల్లోంచి తొలగించబడిన వారు, తన తరఫున పైరవీలు నడిపించగలిగిన వారు, తన ఆంతరంగిక వ్యవహారాలను పర్యవేక్షించేవారు.. ఇలా రకరకాల వ్యక్తులను తీసుకువచ్చి.. వారందరికీ సలహాదారులుగా పదవులు కట్టబెట్టారు. ఎంత ఘోరంగా పరిస్థితి ఉండేదంటే.. సలహాదారులు అనే పదవుల్లో ఇబ్బడిముబ్బడిగా మనుషులు ఉండేవారు.. అందరూ మొత్తంగా కోట్లరూపాయల వేతనాలు పొందుతూ ఉండేవారు. వారిలో చాలామందికి కనీసం కార్యాలయాలు, చాంబర్లు కూడా ఉండేవి కాదు. చాంబర్లు ఉన్నవారికి.. అసలు పని ఉండేది కాదు. సలహాదారు అనేది కేవలం.. చాలా మంది విషయంలో- జగన్ వాళ్లకు ముష్టిగా పడేసిన పదవి తప్ప.. వారిని అయిదేళ్ల పదవీకాలంలో ఒక్క సలహా అడగడం గానీ.. వారు సలహా చెప్పడం గానీ జరగనేలేదంటే అతిశయోక్తి కాదు.
కొందరు సలహాదారులు అయితే.. ఆ పదవిలో తాము ఏదో ఉద్ధరించేస్తాం అనుకుంటూ పదవులను స్వీకరించి.. జగన్ కు ఏమైనా సలహాలు చెప్పాలని సుదీర్ఘకాలం నిరీక్షించి.. ఆయన కనీసం తమను పట్టించుకోకపోవడంతో అర్థంతరంగా పదవులకు రాజీనామాలు చరేసిన వారు కూడా ఉన్నారు.
అయితే చంద్రబాబునాయుడు.. సలహాదారు అనే పదవి.. పనికిమాలిన వాళ్లకు పునరావాసం కల్పించడానికి ఇచ్చే కంటితుడుపు పదవిలాగా కాకుండా.. ఈనలుగురు కీలకమైన వ్యక్తులను మేధావులను పదవుల్లో నియమించడం ద్వారా.. ప్రభుత్వం పనితీరు ఎలా ఉండబోతున్నదో ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారు. వీరిద్వారా.. రాష్ట్రం ఆయా రంగాల్లో వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లడం సాధ్యమవుతుందని పలువురు ఆశిస్తున్నారు.
‘సలహాదారు’ పదానికి గౌరవం తెచ్చిన చంద్రబాబు!
Saturday, March 22, 2025
