దేశంలో నెలకొన్న రాజకీయ అనివార్య పరిస్థితుల దృష్ట్యా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో తిరిగి వ్యూహాత్మక సంబంధాలు ఏర్పరచుకోవడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుముఖంగా ఉన్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు.
జి20 అధ్యక్షత గురించి సోమవారం జరిపిన అధిక పక్ష సమావేశంలో చంద్రబాబు లేవనెత్తిన అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించడమే కాకుండా, ఆ అంశాలను మరింత వివరంగా చర్చించడం కోసం నీతి ఆయోగ్ సీఈవో ను కలవమని సూచించడం జరిగింది.
ప్రధాని సూచన మేరకు మంగళవారం నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌తో తె చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. అఖిలపక్ష సమావేశంలో తాను ప్రస్తావించిన డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్‌పై నీతి ఆయోగ్ అధికారులతో చర్చించారు.
యువశక్తిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకొనేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తే 2047 నాటికి ఇండియా నంబర్ వన్ దేశంగా ఎదగడం ఖాయమని చంద్రబాబు ప్రధానితో జరిగిన సమావేశంలో చెప్పారు. దీని వల్ల భారతీయులు ఉద్యోగ, సంపద సృష్టికర్తలుగా మారి.. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, రాజకీయ, కార్పొరేట్ వ్యవస్థలను శాసించగలిగే స్థాయికి చేరొచ్చని వివరించారు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ నాయకత్వంలో ‘ఇండియా ఎట్ 100 ఇయర్స్- గ్లోబల్ లీడర్’ పేరుతో విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు. వాస్తవానికి, ఈ పత్రం తయారు గురించి చంద్రబాబు నాయుడు కొద్దీ నెలలుగా నీతి ఆయోగ్ సహకారంతో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రధాని కార్యాలయం నుండి వచ్చిన సూచన మేరకు ఆయన ఈ కసరత్తు చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
వాస్తవానికి టిడిపితో మరోసారి పొత్తు ఏర్పరచుకోవడం పట్ల బిజెపి అగ్రనాయకత్వం సుముఖంగా లేరు. కేవలం బలహీనమైన నాయకులతోనే పొత్తుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకనే గత నాలుగేళ్లుగా జగన్ మోహన్ రెడ్డితో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. సిబిఐ కేసులలో చిక్కుకున్న జగన్ తమను ఎదిరించే పరిస్థితి లేదనే బలహీనతతో ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, జగన్ కు మద్దతు ఇస్తున్న సామజిక వర్గాలు, మైనారిటీలు సాంప్రదాయకంగా బిజెపిని వ్యతిరేకిస్తూ ఉండడంతో ప్రత్యక్షంగా ఎన్నికలలో బిజెపితో పొత్తు పెట్టుకోవడం జగన్ కు రాజకీయంగా ఆత్మహత్య సాదృశ్యం కాగలదు. అయితే, చంద్రబాబుతో అటువంటి ఇబ్బంది లేదు. బిజెపి అంతర్గత సర్వేల ప్రకారం ప్రస్తుతం ఉన్న సీట్లలో ఎంపీ 70 వరకు వచ్చే ఎన్నికలలో కోల్పోయే అవకాశం ఉంది.
ఆ లోటు భర్తీ చేసుకోవాలంటే రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపి సొంతంగా 10 నుంచి 15 సీట్లు కనీసం గెల్చుకోవలసిందే. అందుకనే ఒక వంక తెలంగాణాలో కాంగ్రెస్ ను పక్కకు నెట్టి, రెండో స్థానం ఆక్రమించడం ద్వారా ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో టిడిపితో కలిస్తే 5 నుండి 7 లోక్ సభ సీట్లు గెల్చుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
బీజేపీతో పొత్తు కోసం 10 వరకు లోక్ సభ సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. బిజెపికి రాష్ట్రంలో చెప్పుకోదగిన బలం లేకపోయినప్పటికీ జగన్ ప్రభుత్వ దౌర్జన్యాల నుండి రక్షణ కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యత అవసరమని భావిస్తున్నారు.
ఈ విషయంలో చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న ఆర్ఎస్ఎస్ వర్గాలలో సహితం జగన్ ప్రభుత్వంపు `హిందూ వ్యతిరేక’ విధానాల కారణంగా ఇప్పుడు కొంత సానుకూలత ఏర్పడుతున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు దూతలు కీలక ఆర్ ఎస్ ఎస్ నేతలతో ఈ విషయమై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది.