జగన్ ‘తొలిసంతకం’పై బాంబు వేసిన చంద్రబాబు!

Sunday, December 22, 2024

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తొలిసంతకం అనే మాట ద్వారా.. వాలంటీర్ల జీవితాలను అయోమయంలోకి నెట్టేశారో, వారికి వరం ప్రసాదించారో.. పాపం వారికే అర్థం కావడం లేదు. వైఎస్ జగన్ చాలా ఆర్భాటంగా తాను రెండోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే.. వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించడం మీదనే తొలిసంతకం పెడతానని అన్నారు. ఈ ‘పునరుద్ధరించడం’ అనే పదం ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదు. వాలంటీరు వ్యవస్థ అసలు రద్దయితే కదా పునరుద్ధరణ అని అంతా అనుకుంటున్నారు. ఒకవేళ, ఈసీ ఆదేశాలను సాకుగా చూపించి, చంద్రబాబు మీద బురద చల్లడానికి వాలంటీర్లకు ఈ రెండు నెలల పాటు జీతాలు ఎగ్గొట్టేలా ఆ వ్యవస్థను రద్దుచేస్తున్నట్టు జగన్ ప్రకటిస్తారా? అనే భయాలు వారిలో కలుగుతున్నాయి.

ఏది ఏమైనప్పటికీ.. జగన్ ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేసినా.. ఆ వాలంటీరు పునరుద్ధరణకే తన తొలిసంతకం అంటున్న హామీపై చంద్రబాబు ఓ బాంబు వేసేసినట్టే భావించాలి. ఎందుకంటే.. తొలిసంతకం అనే పదం ద్వారా వాలంటీర్లను మరింతగా తన పార్టీ తొత్తుల్లా వాడుకోవచ్చునని జగన్ అనుకుని ఉండవచ్చు గాక.. కానీ.. చంద్రబాబునాయుడు వాలంటీర్లు అందరికీ తమ ప్రభుత్వం వస్తే.. జీతం రూ.పదివేలుగా పెంచుతానని అద్భుతమైన వరాన్ని ప్రకటించారు. ఇది వాలంటీర్లు గా పనిచేస్తున్న వారందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు.

వాలంటీర్లు కేవలం రూ.5వేల నెల జీతానికి పనిచేస్తుంటారు. వారికి ప్రభుత్వ పరంగా ఉండే బాధ్యతలు తక్కువే కావొచ్చు. కానీ.. నెలమొత్తం పనిచేసినట్టుగానే వారి పరిస్థితి ఉంటోంది. పింఛన్ల పంపిణీ, రేషను సరకుల పంపిణీ అన్నింటినీ పర్యవేక్షించుకోవాల్సి ఉంటుంది. తమ జీతాలు పెంచాలని వారు చాలాకాలంగా కోరుతున్నారు. మధ్యలో ఒకసారి వైసీపీ సర్కారు 750 రూపాయలు పెంచుతున్నట్టుగా మంత్రి చెప్పారు గానీ.. అది కూడా అమల్లోకి రాలేదు. జీతాల పెంపుకోసం వాలంటీర్లు ఆందోళనలు చేశారు కూడా.

నిజానికి ప్రభుత్వ పనుల కంటె వాలంటీర్లను పార్టీ అవసరాలు, పార్టీ పనుల కోసం వాడుకోవడమే ఎక్కువ. వారిద్వారా పొందుతున్న సమాచారం వైసీపీ పార్టీకి చాలా విలువైనది. కానీ.. ఇప్పుడంటే ఎన్నికల సీజను గనుక.. అభ్యర్థులు వారికి తాము సొంతంగా కొంత సొమ్ము ముట్టజెబుతున్నారు గానీ.. ఇన్నాళ్లూ వాలంటీర్లను అప్పనంగా వాడుకున్నారు.
ఇన్ని వ్యవహారాల మధ్య చంద్రబాబునాయుడు వాలంటీర్ల జీతాలను పదివేలకు పెంచుతున్నట్టుగా చేసిన ప్రకటన.. ఆ వర్గంపై పెద్ద వరమే అని చెప్పాలి. ఆ రకంగా.. తొలి సంతకం అనే పదం ద్వారా వాలంటీర్లను మభ్యపెట్టడానికి జగన్ చేసిన ప్రయత్నాన్ని చంద్రబాబు వమ్ము చేసినట్టు అయింది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles