దేవుడు కరుణించినా.. పూజారి కరుణించలేదనే సామెత మనందరికీ తెలుసు. దీని మర్మం అర్థం చేసుకుంటే.. దేవుడికంటె పూజారి చాలా పవర్ ఫుల్ అని మనకు అర్థమవుతుంది. ప్రభుత్వ యంత్రాంగంలో ఓఎస్డీలు అంటే కూడా అంతే. మంత్రులను మించిన సర్వాధికారాలను వారు చెలాయిస్తుంటారు. మంత్రులకు కూడా తెలియకుండా అనేక వ్యవహారాలు చక్కబెట్టేస్తూ ఉంటారు. మంత్రుల కనుగప్పి.. ఓవరాక్షన్ చేస్తుంటారు. ఆ మాటకొస్తే.. కొందరు మంత్రులు ఓఎస్డీల దందాలు తెలిసినా కూడా ఏమీ చేయలేని, ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. ఎందుకంటే.. వారి మీద పూర్తిగా ఆధారపడి ఉండడం, తమ జుట్టు అప్పటికే వారి చేతులకు అప్పగించి ఉండడం జరుగుతూ ఉంటుంది.
చంద్రబాబునాయుడు కేబినెట్ లో మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో సుమారు పదిమంది వద్ద పనిచేస్తున్న ఓఎస్డీలు తమ తమ సొంత దుకాణాలు తెరచినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిఘావిభాగం ద్వారా సమాచారం అందింది. వీరెవ్వరూ ఆయా శాఖల మంత్రుల్ని కూడా లెక్కచేసే స్థితిలో లేరని ఆయనకు నివేదికలు అందాయిట. వీరి వ్యవహార సరళి, దందాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నదని కూడా నివేదికలు అందాయిట. దీంతో చంద్రబాబు నాయుడు ముందుగానే అలర్ట్ అవుతున్నారు. ఇప్పటికే కొల్లు రవీంద్ర వద్ద పనిచేస్తున్న ఓఎస్డీని గతంలోనే తప్పించారు. అలాగే ఈ పదిమంది మంత్రుల వద్ద ఉన్న ఓఎస్డీలపై కూడా యాక్షన్ ఉంటుందని అంతా అనుకుంటున్నారు.
మంత్రుల ఓఎస్డీలు హాస్టళ్ల మెనూ వ్యవహారాల్లోనూ అవినీతికి పాల్పడుతున్నారని, దేవాదాయ భూములను కాజేస్తున్నారని రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పదిమంది మంత్రుల ఓఎస్డీల వ్యవహార సరళి గురించి ఇంటెలిజెన్స్ నివేదికలు సిద్ధం అయ్యాయి.
ఈ సమాచారాన్ని గురించి చంద్రబాబునాయుడు.. పార్టీ వర్గాల ద్వారా కూడా ధ్రువీకరించుకున్నట్టుగా తెలుస్తోంది. క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు కూడా వారి దందాలు నిజమేనని తేలిన తర్వాత.. వారి మీద వేటు వేయాల్సిందేనని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
మంగళవారం జరిగే కేబినెట్ భేటీ తరువాత.. మంత్రులతో విడిగా సమావేశమై ఓఎస్డీ ల విషయంలో నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. తక్షణం వారిని తప్పించాలని, అలాగే ఆ పదవుల్లోకి కొత్తగా ఎవరు వచ్చినా కూడా.. వారి పనితీరు గురించి మంత్రులు సదా అప్రమత్తతతో ఒక కన్నేసి ఉంచాలని చంద్రబాబునాయుడు హెచ్చరించబోతున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓఎస్డీ స్థాయిలోని వ్యక్తుల అవినీతిని మొగ్గలోనే తుంచేసి హెచ్చరిక సంకేతాలు పంపకపోతే.. ముందు ముందు ప్రభుత్వం భ్రష్టు పట్టిపోతుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబు అలర్ట్ : మంత్రుల ఓఎస్డీపలై నిఘా నజర్!
Sunday, April 27, 2025
