వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సూత్రధారిగా, సాక్ష్యాలను దగ్గరుండి చెరపివేయించి.. మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ఈ హత్య కేసులో ఆయన ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. ఆయనతో సహా ఇతర కీలక నిందితుల బెయిళ్లను కూడా రద్దు చేయాలని కోరుతూ.. వివేకానందరెడ్డి కూతురు సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు. ఈ పిటిషన్ పై మంగళవారం సుప్రీం ధర్మాసనం వాదనలు విన్నది. కీలక పరిణామం ఏంటంటే.. వివేకానందరెడ్డిని ఆయన కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి కలిసి హత్యచేశారని పెట్టిన కేసును, అలాగే కేసును తొలుత దర్యాప్తు చేసిన సీబీఐ అధికారి రాంసింగ్ పై పెట్టిన కేసును సుప్రీం క్వాష్ చేసింది.
అదేసమయంలో.. ఈ కేసు తదుపరి విచారణను సెప్టంబరు 9కి సుప్రీం వాయిదా వేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమో లేదో చెప్పాలని, దర్యాప్తులో నిందితులను కస్టోడియల్ విచారణ చేయాల్సిన అవసరం ఉన్నదో లేదో కూడా చెప్పాలని సుప్రీం సీబీఐను ఆదేశించింది. అలాగే, నిందితుల బెయిళ్లను రద్దు చేయాలని సీబీఐ తరఫు న్యాయవాది చేసిన వాదనలను కూడా సుప్రీం పరిగణనలోకి తీసుకుంది. దరిమిలా.. ఎంతమంది నిందితుల బెయిల్ రద్దు చేయాలనే విషయాన్ని కూడా సెప్టెంబరు 9నాటికి చెప్పాలని సీబీఐని ఆదేశించింది. ఈ పరిణామాలను గమనిస్తోంటే.. అవినాష్ రెడ్డి అండ్ కోకు మంజూరైన బెయిళ్లు రద్దయ్యే అవకాశం ఉన్నదని నిపుణులు భావిస్తున్నారు.
మంగళవారం పరిణామాల్లో ప్రధానంగా.. సునీత మీద జగన్ దళం పెట్టిన కేసు క్వాష్ కావడం కీలకం! ఇది జగన్ మరియు అవినాష్ లకు, వారికి సహకరించిన కీలక నిందితులకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. వివేకానందరెడ్డిని ఆస్తుల కోసం ఆయన కన్నకూతురు, అల్లుడు కలిసి చంపించినట్టుగా అవినాస్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో నిందలు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో కూడా ఆమె మీద నిందలు వేస్తూ.. తద్వారా రాజకీయ ఎడ్వాంటేజీ తీసుకోవాలని వారు ప్రయత్నించారు. తండ్రిని కోల్పోయిన సునీత, హత్య చేసినట్టు నిందలు కూడా తనమీదనే వేస్తుండగా.. వాటన్నింటినీ భరిస్తూ న్యాయపోరాటం చేస్తూ వచ్చారు.
తన తండ్రిని చంపిన నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని.. శిక్ష వారికి కాకుండా తనకు వేసినట్టుగా కనిపిస్తోందని.. తాను మాత్రం ఇంకా కోర్టుల చుట్టూ తిరుక్కుంటూ న్యాయం కోరుతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆమె మీద హత్యకేసు క్వాష్ కావడం వారికి పెద్ద ఉపశమనం కాగా, ఎందరి బెయిళ్లు రద్దు చేయాలోచెప్పాలని సుప్రీం సీబీఐను అడగడం గమనిస్తే.. అవినాష్ రెడ్డి అండ్ కో బెయిళ్లు రద్దు కావడం గ్యారంటీ అని పలువురు అంచనా వేస్తున్నారు.
