ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ అధికారులు ఆదివారం ఏడు గంటలకు పైగా ఆమె ఇంట్లో విచారణ జరపడం రాజకీయ కలకలం రేపింది. అయితే ఇంతటితో విచారణ పూర్తి కాలేదని, ఇది ప్రారంభం మాత్రమే అని తెలుస్తున్నది.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆమెను సాక్షిగా మాత్రమే విచారించారు. వాస్తవానికి ఆమె పేరు ఈ కేసులో ఈడీ రేమండ్ రిపోర్ట్ లో రావడంతో ఈ విచారణ జరిగింది. సిబిఐ మరోసారి మరికొన్ని వివరాల కోసం ఆమెను విచారిస్తుందా? లేదా ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేసి ఆమెను విచారణకోసం ఢిల్లీకి రమ్మనమని సమన్లు పంపుతుందా? అనే చర్చలు జరుగుతున్నాయి.
అయితే ఇప్పటికే 91 సీఆర్పీసీ కింద కవితకు మరోసారి సిబిఐ నోటీసులు జారీ చేసిన్నట్లు చెబుతున్నారు. ఈసారి కవిత నివాసంలో కాకుండా.. తాము చెప్పిన చోటకు వచ్చి.. విచారణకు హాజరవ్వాలని స్పష్టం చేశారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు తాము అడిగిన పత్రాలను సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఎవరు నోటీసులుఅందుకుంటే వాళ్లు మాత్రమే హాజరుకావాలని వెల్లడించారు. కేసుకు సంబంధించి మరిన్ని డాక్యుమెంట్లకు సంబంధించి సమాచారం కావాలని.. కావాల్సిన పత్రాలు, సాక్షాలు ఇవ్వాలని కోరారు. విచారణ తేదీ, స్థలాన్ని త్వరలోనే మెయిల్ చేస్తామని చెప్పారు సీబీఐ అధికారులు.
ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6-30 గంటల వరకు ఏకబిగువున ఏడున్నర గంటల పాటు సీబీఐ అధికారులు కవితను విచారించడంలో అభిమానులు, కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో కవిత నివాసానికి భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కాగా మహిళ విచారణ సందర్భంలో సూర్యాస్తమయం లోపు విచారణ పూర్తి కావాల్సి ఉంది. అయినప్పటికీ కవితను సూర్యాస్తమయం దాటిన విచారణను కొనసాగించడంలో కార్యకర్తలు, నేతల్లో ఆందోళనతో కూడిన ఉత్కంఠ మొదలైంది.
సిబిఐ వివరణ ముగించుకున్న కవిత అనంతరం న్యాయనిపుణులతో చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం కవిత తన నివాసం నుంచి బయటకు వచ్చి నేతలకు, కార్యకర్తలకు ‘విక్టరీ’ సింబల్ చూపుతూ అభివాదం చేయడం గమనిస్తే విచారణ జరిగిన తీరు పట్ల ఆమె ఇబ్బంది పడుతున్నట్లు లేదని భావించవలసి వస్తుంది.
అక్కడ్నించీ మీడియాతో మాట్లాడకుండానే మంత్రి తలసానితో కలిసి ఆమె నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లి తండ్రి కేసీఆర్ సమక్షంలో పలువురు న్యాయనిపుణులతో సమాలోచనలు జరిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు రెండు వాహనాల్లో బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి సిబిఐ అధికారులు చేరుకున్నారు. వారిలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు.
సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిబిఐకు కవిత వివరణ సందర్భంగా కార్యకర్తలు, నేతలు ఎవ్వరూ రావొద్దని బిఆర్‌ఎస్ ఆదేశించింది. దీంతో ఆదివారం ఉదయం నుంచి కవిత నివాసానికి వెళ్లే మార్గమంతా నిర్మానుష్యంగా మారింది.
మరోవైపు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాలపై ఎంఎల్‌సి కవితను సిబిఐ అధికారులు వివరణ కోరినట్లు సమాచారం. ఇప్పటికే అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఇడి ప్రస్తావించింది. సౌత్ గ్రూప్ కంట్రోలర్‌గా కవిత ఉన్నారని ఇడి తెలిపింది.
సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతలకు ఇచ్చేందుకు రూ.100 కోట్లను విజయ్ నాయర్‌కు అందినట్లు సిబిఐ, ఇడి ఆరోపణలు చేస్తున్నాయి. ఎంఎల్‌సి కవిత 10 ఫోన్లు ధ్వంసం చేశారని అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో సిబిఐ పేర్కొంది. ఈ అంశంపైనే ఎక్కువగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.