వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి- వర్ధంతి సందర్భాలలో ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద తప్ప ఇటీవల బాహ్యప్రపంచంలో ఎక్కడా పరస్పరం తారసపడకుండా తప్పించుకు తిరుగుతున్న వైఎస్ జగన్, ఆయన తల్లి విజయమ్మ.. మంగళవారం నాడు ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు. మీడియా కనుగప్పలేని స్థితిలో వారు ఒకే చోట ఉండాల్సి వచ్చింది. ఇతరత్రా రకరకాల ప్రచారాలకు ఆస్కారం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి, తల్లి విజయమ్మతో కొద్దిసేపు మాట్లాడారు. విజయమ్మ కూడా ఎప్పటిలాగానే కొడుకును కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది. చూసినవాళ్లు మాత్రం- కేసులు కేసులే, ముద్దులు ముద్దులే.. అంటూ నవ్వుకోవడం విశేషం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ మధ్య ట్రిబ్యునల్ వేదికగా ఆస్తులకోసం పెద్ద యుద్ధమే నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సరస్వతి పవర్ లోని వాటాలను తల్లికి గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి.. ఆ తరువాత.. ఆ డీడ్ చెల్లుబాటును రద్దు చేయాలని.. ఆ వాటాలను తనకు తిరిగి ఇప్పించాలని కోరుతూ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన సంగతి అందరికీ తెలుసు. అయితే.. వైఎస్ విజయమ్మ కూడా ఊరుకోలేదు. అసలు సరస్వతి పవర్ లో ఆస్తుల వాటాలు సమస్తం తనవేనని.. మరెవ్వరికీ దానిమీద హక్కులేదని ఆమె కౌంటర్ దాఖలు చేశారు. ప్రత్యేకించి.. జగన్ కు గానీ, ఆయన భార్య భారతికి గానీ హక్కులేదని కూడా ఆమె ప్రస్తావించారు. జగన్ ఉద్దేశపూర్వకంగా షర్మిలను రచ్చకీడ్చడానికే ఇలాంటి కేసు వేసినట్టుగా తీవ్రమైన ఆరోపణలు చేశారు.
జగన్మోహన్ రెడ్డి కూడా దానికి తగినట్టుగానే.. తాను తన పట్ల ప్రేమతో ఉంటారనే ఉద్దేశంతోనే తల్లికి గిఫ్ట్ డీడ్ గా ఆస్తులు ఇచ్చానని, అయితే ఆమె షర్మిలకు అనుకూలంగా ఉంటున్నారు గనుక.. షర్మిల తనకు శత్రువుగా మారారు గనుక.. ఆ డీడ్ చెల్లకుండా చేయాలని అర్థం వచ్చేలా పిటిషన్ వేశారు. అయితే.. విజయమ్మ ప్రత్యేకించి.. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉండగా ఏర్పడిన ఆస్తులన్నీ కూడా.. జగన్ మరియు షర్మిలకు సమానంగా చెందుతాయని, ఇదే వైఎస్సార్ కోరిక అని బహిరంగ ప్రకటన చేసి జగన్ ను ఇరుకున పెట్టడం విశేషం. ఈ రాద్ధాంతాలన్నీ రచ్చకెక్కపూర్వమే విజయమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యొక్క గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా కూడా చేసేసి.. కుటుంబంలో ఏదో నిప్పు రాజుకుంటున్నదనే సంకేతాలను పంపారు. మొత్తానికి తల్లి కొడుకుల మధ్య అంతర్యుద్ధం బహిరంగంగానే నడుస్తోంది.
తాజాగా వైవీసుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియల సందర్భంగా మేదరమిట్టలో వారిద్దరూ తారసపడ్డారు. విజయమ్మ మాత్రం.. ఎప్పటిలాగానే కొడుకును ముద్దులుపెట్టుకున్న వైనం చూసి.. ప్రజలు మాత్రం.. కేసులు కేసులే ముద్దులు ముద్దులే అని అనుకున్నారు.
కేసులు కేసులే.. ముద్దులు ముద్దులే!
Saturday, April 26, 2025
