ఉమ్మడి జిల్లాల పరంగా చూసినప్పుడు రాష్ట్రంలోని 13 లో నాలుగు కీలక జిల్లాలను కవర్ చేస్తున్న పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తూచ్ అనేసింది. ఈ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేయబోవడం లేదు- అని పార్టీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరిగే పరిస్థితి కనిపించడం లేదని.. శాంతి భద్రతలు అదుపులో లేవని.. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం ఉండాలని తాము నిర్ణయించుకున్నట్లుగా పేర్ని నాని వివరించారు. ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశం లేదుట! ఓటర్లు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఓట్లు వేసే వాతావరణం కూడా లేదుట! అందువలన ఎన్నికల బరి నుంచి తప్పుకోబోతున్నట్లుగా వారు ప్రకటించారు. అయితే వాస్తవం వేరే ఉన్నదని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి!!
రాష్ట్రంలో ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాలు మరియు గుంటూరు కృష్ణా జిల్లాలకు కలిపి రెండు పట్టభద్ర స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించేసి ప్రచార పర్వంలో దూసుకెళ్లిపోతోంది. అయితే వైసీపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ ఎన్నికలలో బరిలోకి దిగాలని పార్టీ తరఫున పలువురు నాయకులను సంప్రదించినప్పుడు వారెవరూ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. సార్వత్రిక ఎన్నికలలో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుని ఐదు నెలలు మాత్రమే గడుస్తున్న ప్రస్తుత తరుణంలో.. కేవలం పట్టభద్రులు అనగా చదువుకున్నవాళ్లు- అంతో ఇంతో ఆలోచన పరులు మాత్రమే ఓట్లు వేసే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ గెలుస్తుందనేది భ్రమ అనే అభిప్రాయంతోనే ఆ పార్టీ నాయకులు ఉన్నారట. టికెట్ ఇస్తాం అని పార్టీ ఆఫర్ చేస్తుంటే మాకు వద్దు అని తిరస్కరిస్తున్నారట. ప్రస్తుతానికి తమ వద్ద ఎన్నికల ఖర్చులకు కూడా డబ్బు లేవని, పోటీ చేసే ఉద్దేశం కూడా లేదని అంటున్నారట! వైసీపీకి అభ్యర్థులకు గతిలేకపోయినప్పటికీ.. బయటకు మాత్రం రాష్ట్రంలో ధర్మబద్ధంగా ఎన్నికలు జరిగే అవకాశం లేదు కనుక తాము బరిలోకి దిగకుండా ఆగుతున్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ పార్టీ వారి వ్యవహారసరళి చూస్తూ ఉంటే అచ్చంగా తొలుత చెప్పుకున్న సామెత మాదిరిగానే ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.