1500 పైచిలుకు ఎకరాల భూమి సరస్వతీ పవర్ సంస్థకు ఉంది. ఆ కంపెనీ షేర్లనే జగన్ గిఫ్ట్ డీడ్ ద్వారా తల్లికి రాసి ఇచ్చారు. ఆయనకు ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి కదా. వాటన్నింటితో సర్దుకుంటే సరిపోతుంది కదా. తల్లికి ఇచ్చిన డీడ్ రద్దు చేయాలని కోర్టుకు ఎక్కి ఇంతగా భ్రష్టు పట్టిపోవడం అవసరమా? సరస్వతి పవర్ సంస్థ కోసం జగన్ ఎందుకు అంతగా పట్టుపడుతున్నారు. ఏంటి మతలబు? ..లాంటి సందేహాలు ఈ సమయంలో ఎవ్వరికైనా కలుగుతాయి. కానీ కేవలం పవర్ సంస్థ మాత్రమే అయితే.. దాని గురించి జగన్ కూడా ఇంతగా పట్టించుకునేవారు కాదేమో. కానీ దానిని సిమెంట్ కంపెనీగా కూడా రూపుమార్చారు. దానికోసం సున్నపురాళ్ల గనులను తవ్వుకోవడానికి కూడా అనుమతులను ప్రభుత్వంనుంచి తీసుకున్నారు. కంపెనీ నడపడానికి అవసరమైన నీటి కేటాయింపులను కూడా జగన్ తన కంపెనీకి తానే ఇచ్చుకున్నారు.
సరస్వతీ పవర్ సంస్థకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే సున్నపురాళ్ల గనులను కేటాయించడం జరిగింది. అది చిన్న వ్యవహారం కానే కాదు. అయితే జగన్ కేటాయింపులు చేయించుకున్నారే తప్ప వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించలేదు. తెలుగుదేశం పార్టీవారు తొలినుంచి ఈ కేటాయింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ సరస్వతి అక్రమాలపై 2008 నుంచి కూడా వ్యక్తిగతంగా పోరాడుతున్నానని తెలుగుదేశం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అంటున్నారు. ఆయన మడమ తిప్పని పోరాటం ఫలితంగా.. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. సరస్వతీ పవర్ గనుల కేటాయింపును రద్దు చేశారు.
2019లో జగన్ గద్దె ఎక్కారు. సరస్వతీ ఎపిసోడ్ ను మళ్లీ తెరపైకి తెచ్చారు. అడ్డదారుల్లో ఆ కంపెనీకి కేటాయించిన సున్నపురాళ్ల గనులను పునరుద్ధరించారు. పైగా కంపెనీ నడపడానికి అవసరమైన నీటికేటాయింపులను శాశ్వత ప్రాతిపదికన కేటాయించుకున్నారు. సాధారణంగా కంపెనీలకు ఐదు సంవత్సరాలకు మాత్రమే నీటి కేటాయింపులు జరగాలి. ఆ తర్వాత మళ్లీ దానిని పునరుద్దరించుకోవాలి. కానీ.. తానే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ శాశ్వత నీటికేటాయింపులు చేసేశారు. ఇంతా కలిపి కార్యకలాపాలు మాత్రం ప్రారంభించలేదు.
కేవలం అది 1500 ఎకరాల విలువ మాత్రమే కాదుని.. పదివేల కోట్ల రూపాయలకు పైగా విలువైన సున్నపురాళ్ల గనుల కేటాయింపు కూడా దానితో ముడిపడి ఉన్నదని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. అందుకే పరువుపోయినా పర్లేదుగానీ.. ఆ భూముల్ని మాత్రం వదులుకోరాదని జగన్ నిర్ణయించుకున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు.
‘సరస్వతి’కి గనులు, నీటి కేటాయింపుల రద్దు!
Tuesday, January 21, 2025