144 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన సందర్భం అంటూ.. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో జరుగుతున్న మహాకుంభమేళాలో జరిగిన అపశ్రుతి చిన్నది కాదు. అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం 40 మందికి పైగా మరణించారు. పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులు అంతకంటె పెద్దసంఖ్యలో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన తర్వాత అనేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ.. దుర్ఘటన విషయంలో యూపీ సర్కారు వైఖరి సర్వత్రా విమర్శల పాలవుతోంది.
బారికేడ్లు విరిగిపోవడం వల్లనే తొక్కిసలాట జరిగినట్లుగా, చీకటి కావడం వల్ల మరింత ప్రమాదం తీవ్రత పెరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ రెండు అంశాల్లోనే ప్రభుత్వం నిందార్హం అనిపిస్తోంది. వేల కోట్ల రూపాయలు పెట్టి ఏర్పాట్లు చేసినట్టుగా, 40-50 కోట్ల మంది మంది భక్తులు వచ్చినాసరే ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేలా ఏర్పాట్లు చేసినట్టుగా యూపీ ప్రభుత్వం పదేపదే చెప్పుకుంది. జనం తొక్కిడి ఉంటుందని వారికి ముందే తెలుసు. విరిగిపోయే తరహా బారికేడ్లు ఏర్పాటు చేయడమే పెద్ద లోపం. అసలు జనం ఉన్న ప్రాంతం చీకటిలో ఉండాల్సిన దుర్మార్గమైన పరిస్థితి ఎందుకు ఏర్పడిందనేది ఇంకో ప్రభుత్వ లోపం! ఈ విషయాలకు తోడు.. మరణాల తర్వాత ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు కూడా విమర్శల పాలైంది. అర్ధరాత్రి 2 గంటలకు ప్రమాదం జరిగితే.. మరణాల సంఖ్యను మధ్యాహ్నం దాకా అధికారికంగా ప్రకటించనేలేదు. కేవలం వారు ప్రకటించకపోవడం వలన.. పుకార్లు విచ్చలవిడిగా వచ్చాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మీడియా ముందుకొచ్చి, పుకార్లు నమ్మొద్దు అని చెప్పారే తప్ప.. అధికారికంగా మరణాల సంఖ్య చెప్పలేదు. ప్రమాదానికి ఎవ్వరూ నైతిక బాధ్యత వహించలేదు.
ఇదే ప్రయాగ్ రాజ్ లో పన్నెండేళ్ల కిందట ఇదే తరహాలో మహాకుంభమేళా జరిగినప్పుడు ఒక ప్రమాదం జరిగింది. అప్పుడు జరిగిన ప్రమాదం ఘాట్ లవద్ద కాదు. రైల్వేస్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలడంతో కలకలం రేగింది. తొక్కిసలాట జరిగింది. ఏకంగా 36 మంది మరణించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలడం అనేది ఏ రకంగానూ రాష్ట్రప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాదు. కుంభమేళా ఏర్పాట్లకు సంబంధించిన వ్యవహారం కూడా కాదు. కానీ.. ఆర్గనైజింగ్ కమిటీకి ఛైర్మన్ గా ఉన్న మంత్రి ఆజామ్ ఖాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ ప్రమాదానికి తాను నైతిక బాధ్యత వహిస్తున్నట్టుగా పేర్కొన్నారు.
ఆ ప్రమాదంతో సంబంధంలేకపోయినా నైతిక బాధ్యత వహించారు. ఇప్పుడు కుంభమేళాలో జరిగిన ప్రమాదం పూర్తిగా నిర్వాహకుల తప్పిదం. ఈ ఘోరానికి ఏ ఒక్కరూ నైతిక బాధ్యత వహిస్తున్నట్టుగా ఇప్పటిదాకా ఒక్క వార్త కూడా రాలేదు. అధికారం, పదవులు కోరుకునే వారిలో ఎంతగా జడత్వం, అమానవీయత పేరుకుపోయిందో తెలుసుకోవడానికి ఇది పెద్ద నిదర్శనం అని ప్రజలు అనుకుంటున్నారు.
ఆ నైతికత ఇప్పుడు వెతికినా దొరుకుతుందా?
Wednesday, February 19, 2025
