ఎన్నికల సంఘం ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిని బదిలీచేసింది. ఆ స్థానంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఇన్నాళ్లూ ఉండినటువంటి గుప్తా నియమితులయ్యారు. పోలీసు శాఖను మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బానిసలుగా మార్చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న రాజేంద్రనాధ్ రెడ్డి కీలక స్థానం నుంచి పక్కకు తప్పుకోవడం అనేది పెద్ద పరిణామమే. కానీ.. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా జగన్ కు అత్యంత వీరవిధేయుడు అయినా జవహర్ రెడ్డి ఉండగా.. రాష్ట్రంలో పారదర్శక ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
సీఎస్ జవహర్ రెడ్డిని కూడా బదిలీ చేయాలని, ఆయన నిర్ణయాలు అధికార పార్టీకి మేలు చేసేలా ఉంటున్నాయని.. చాలాకాలంగా తెలుగుదేశం వర్గాలు ఈసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి. డీజీపీ, సీఎస్ ఇద్దరినీ పక్కకు తప్పించాలనేదే వారి ప్రధాన డిమాండ్ గా ఉంటూ వచ్చింది. కానీ.. ఇన్నాళ్లకు డీజీపీని మాత్రం బదిలీచేశారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్ జవహర్ రెడ్డిని కూడా బదిలీ చేస్తేనే సాధ్యమని నరసాపురం ఎంపీ, ఉండి తెదేపా అభ్యర్థి రఘురామక్రిష్ణరాజు డిమాండ్ చేస్తున్నారు.
ప్రధానంగా పోలీసులతోనే ప్రతిపక్షాల వారికి తరచూ ఇబ్బంది ఎదురవుతోంది. అధికార పార్టీకి చెందిన వారు ఎక్కడికక్కడ దాడులకు పాల్పడుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదనేది ఆరోపణ. దాడులు, దహనాలు హత్యలు జరుగుతున్నా కూడా పోలీసుల నుంచి స్పందన ఉండడం లేదు. అందుకే ఈసీ పలువురు ఎస్పీలను బదిలీ చేసింది.
అయితే తమాషా ఏంటంటే.. జగన్ భక్త ఎస్పీలను మార్చినప్పటికీ.. కొత్తగా ఆ స్థానంలో ఎవరిని నియమించాలో ప్యానెల్ లో మూడు పేర్లను సూచించే అధికారం సీఎస్ జవహర్ రెడ్డి చేతిలోనే ఉంటుంది. ఆయన పంపిన మూడు పేర్లలోంచి మాత్రమే ఈసీ ఎంపిక చేస్తుంది. ఒక జగన్ విధేయుడి మీద ఈసీ వేటు వేస్తే , సీఎస్ ముగ్గురు విధేయుల పేర్లను రికమెండ్ చేస్తున్నారని.. అంతిమంగా మళ్లీ జగన్ భక్తులే కీలక పోస్టుల్లోకి వస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వ్యవహారానికి బ్రేక్ పడాలంటే.. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని కూడా ఆ పదవిలోంచి తప్పిస్తే తప్ప ఎన్నికలు సజావుగా, నిజాయితీగా జరిగే అవకాశం లేదని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి.
ఆయన ఉండగా పారదర్శక ఎన్నికలు సాధ్యమేనా?
Sunday, December 22, 2024