బిఆర్ఎస్ ప్రారంభంతో `సెంటిమెంట్’ అస్త్రం కోల్పోతున్న కేసీఆర్

Sunday, December 22, 2024

టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా బిఆర్ఎస్ పేరుతో మార్చడానికి ఎన్నికల కమిషన్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో సంబరాలు చేసుకొంటూ కేంద్రంలో రాబోయేది రైతు ప్రభుత్వమే అంటూ కేసీఆర్ ప్రకటన చేసినప్పటికీ ఆ దిశలో  స్పష్టమైన వ్యూహం ఏదీ ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా, ఇప్పటి వరకు `తెలంగాణ సెంటిమెంట్’తో రాజకీయాలు చేస్తూ వచ్చిన ఆయన అటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారు. 

`ఆంధ్రా గులాములు’, `ఢిల్లీ గులాములు’, `గుజరాతీ బానిసలూ’ అంటూ రాజకీయ ప్రయార్థులపై చేసిన విమర్శనాస్త్రాలు ఇక ఆస్కారం ఉండదు. ఇక తెలంగాణాలో ఎవ్వరు రాజకీయాలు చేసినా వారిని `తెలంగాణకు వ్యతిరేకం’ అనే ముద్రవేసి, కించపరిచే అవకాశం ఉండదు. జాతీయ పార్టీగా జాతీయ రాజకీయాలలో ఆయన ఏమి సాధిస్తారో గాని, తెలంగాణ రాజకీయాలలో మాత్రం కొన్ని అస్త్రాలు కోల్పోవడం ఖాయం అని స్పష్టం అవుతుంది. 

ఇప్పటివరకు తెలంగాణ ప్రయోజనాలకు కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు అడ్డుపడుతున్నాయని అంటూ పోలవరం ప్రాజెక్ట్, కృష్ణ ప్రోజెక్టుల విషయంలో న్యాయపోరాటానికి సిద్ధపడుతున్న ఆయన ఇంకా రాజీధోరణి అనుసరింపక తప్పదు. జేడీఎస్ అధినేత కుమారస్వామి తప్ప జాతీయ రాజకీయాలలో ఆయనకు తోడుగా ఉండేందుకు ఇతర రాష్ట్రాలలో చెప్పుకోదగిన నేతలు ఎవ్వరు ఇప్పటి వరకు ముందుకు రాకపోవడం గమనార్హం. 

తనకు మిత్రులుగా కేసీఆర్ భావిస్తున్న మమతా బెనర్జీ, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్,  ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ థాకరే వంటి వారు కనీసం శుభాకాంక్షలు సహితం గత రెండు నెలలుగా తెలపనే లేదు. కేవలం  కుమారస్వామి మాత్రం రెండుసార్లు బిఆర్ఎస్ ఆవిర్భావ సమావేశంలకు హాజరై సంఘీభావం తెలిపారు. 

కర్ణాటకలో పోటీ ప్రధానంగా బిజెపి, కాంగ్రెస్ ల మధ్య కేంద్రీకరించి ఉండడం, తమకు ప్రాబల్యం గల పాత మైసూర్ ప్రాంతంలో బలం కోల్పోతూ ఉండడంతో కేసీఆర్ తో సయోధ్య ద్వారా రాష్ట్రంలోని తెలుగు వారి ఓట్లు పొందాలనే ఆలోచన తప్ప ఆయనలో సహితం కేసీఆర్ ను జాతీయ నాయకుడిగా చేసే ఉద్దేశం ఉన్నట్టు లేదు. 

ఇక, 2019లో లోక్ సభకు పోటీ చేయడానికి తనకు సీట్ ఇవ్వడానికి ఏ పార్టీ సిద్ధం కాకపోవడంతో, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, డిపాజిట్ కోల్పోయిన నటుడు ప్రకాష్ రాజ్ ఒకరు కనిపిస్తున్నారు. మొదట్లో ఆయనకు రాజ్యసభకు పంపుతారన్నారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు జేడీఎస్ మద్దతు ఇస్తే, బిఆర్ఎస్ అభ్యర్థిగా సెంట్రల్ బెంగుళూరు నుండి పోటీ చేయాలను కొంటున్నారు. ఏదో విధంగా ఎంపీ కావడమే తప్పా, పార్టీ  పరిధిని పెంచగలిగే శక్తిసామర్ధ్యాలు ఆయనలో ఉన్నట్లు అనిపించదు. 

కర్నాటకలో జేడీఎస్‌కు బీఆర్ఎస్‌ మద్దతు ఇస్తుందని చెబుతూ వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో అక్కడ ఆ పార్టీతో కలసి పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇక ఇతర రాష్ట్రాలలో జెండా ఎగురవేయడం గురించి ప్రస్తావించలేదు. ఢిల్లీలో మాత్రం ఈ నెల 14న కార్యాలయం ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలో పార్టీ విధానాలు ప్రకటిస్తామని చెప్పడం ద్వారా నిర్దుష్టమైన విధానాలు లేకుండానే పార్టీని ప్రారంభించామని సంకేతం ఇచ్చిన్నట్లు అయింది. అయితే, తెలంగాణాలో అమలు చేసిన పథకాలనే దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని చెబుతూ వస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles