వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు, ఆయన ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు, జగన్ ను మించి పార్టీ మీద ప్రభుత్వం మీద పట్టు కలిగిఉన్న, పెత్తనం చెలాయించిన వ్యక్తి సజ్జల రామక్రిష్ణారెడ్డిని మంగళగిరి పోలీసులు విచారణ నిమిత్తం పిలిచిన తొలి సందర్భంలోనే అరెస్టు చేస్తారని పార్టీ నాయకులు భయపడ్డారా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి ప్రధాన సూత్రధారి సజ్జలే అని ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో.. ఆయనను తొలివిచారణ రోజునే అరెస్టు చేస్తారనే భయం వారిని వెన్నాడిందా? అందుకే ఇతర నాయకులు విచారణకు హాజరైన సందర్భాలకంటె చాలా చాలా అతి జాగ్రత్తలు తీసుకున్నారా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి. సజ్జల రామక్రిష్ణారెడ్డి విచారణకు హాజరయ్యే చివరి నిమిషం వరకు ఇతర నిందితులందరూ కలిసి.. పోలీసుల విచారణ తీరు గురించి ఆయనకు బ్రీఫింగ్ చేయడానికి తపన పడ్డారనే దాఖలాలు కనిపిస్తున్నాయి. ఆయన వెంట మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర రెడ్డి విచారణకు హాజరు కావడానికి ఉబలాటపడ్డం కూడా ఇందుకే అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.
సజ్జల రామక్రిష్ణారెడ్డి ఈనెల 7వ తేదీన విదేశాలకు వెళ్లిపోయారు. నిజం చెప్పాలంటే.. ఎప్పుడు వస్తారో తెలియదు. దేవినేని అవినాష్, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు కూడా ఈ కేసులో నిందితులే కాగా, వారిపై పోలీసులు ముందే లుకౌట్ నోటీసులు ఇచ్చి ఉన్నారు. ఆ నేపథ్యంలో అవినాష్ దుబాయి వెళుతుండగా.. హైదరాబాదు ఎయిర్ పోర్ట్లో పట్టుకుని వెనక్కు పంపిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ అలాంటి లుకౌట్ నోటీసు లేకపోవడం వల్ల సజ్జల చాలా హేపీగా విదేశాలకు వెళ్లారు. ఆ తర్వాత అంటే 10 వ తేదీన ఆయన పేరిట లుకౌట్ నోటీసు జారీ అయింది. సజ్జల తిరిగి ఇండియా వచ్చేటప్పుడు హైదరాబాదుగానీ, విజయవాడగానీ రాకుండా తెలివిగా ముంబాయిలో దిగేలా ప్లాన్ చేసుకున్నారు. అక్కడ ఆయనను ప్రత్యేకంగా గుర్తించగలవాళ్లు తక్కువ ఉంటారనే ఆశపడి ఉండవచ్చు. కానీ లుకౌట్ నోటీసు కారణంగా పోలీసులు పట్టుకున్నారు. తీరా ఇప్పుడు అరెస్టు చేసే అవసరం లేదని ఏపీ పోలీసులు చెప్పిన తర్వాత విడిచిపెట్టారు. కేవలం ఆ నోటీసు కారణంగానే.. సజ్జల ఎప్పుడు తిరిగివచ్చారనేద అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనను విచారణకు రమ్మని నోటీసులు కూడా పంపారు పోలీసులు.
కానీ.. అంతకు ముందు విచారణకు వెళ్లిన వారు ఏం చెప్పారో? అసలు పోలీసులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో? అవన్నీ సజ్జలకు పూర్తిస్థాయి క్లారిటీ లేదు. అప్పిరెడ్డి, అవినాష్, పొన్నవోలు తదితరులు ఆయనను కలిసి ఆ విషయాలపై బాగా బ్రీఫింగ్ ఇచ్చారు. విచారణకు వెళ్లి కారు దిగి, మంగళగిరి పోలీసు స్టేషన్ ప్రాంగణంలో అడుగుపెట్టేవరకు కూడా వాళ్లు ఆయనతో పాటు కారులో ఉండి బ్రీఫింగ్ చేస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. వాళ్లు అనుకున్నట్టుగానే విచారణ జరిగిందో లేదో గానీ.. మొత్తానికి పోలీసు ప్రశ్నలకు పెడసరం జవాబులు ఇచ్చేసి సజ్జల హేపీగా బయటకు వచ్చేశారు. ఫోను ఇవ్వబోనని, అసలు దాడితో తనకు సంబంధం లేదని, పట్టాభి మాటలు వెంటే రక్తం మరిగి తన్నాలని అనిపించిందని.. ఆయన రకరకాల జవాబులు చెప్పారు. చూడబోతే విచారణల పర్వం ఇక్కడ దాదాపుగా ముగిసిన, ఇక త్వరలో వారు అనుమానిస్తున్న అరెస్టుల పర్వం ప్రారంభం అవుతుందని ప్రజలు అనుకుంటున్నారు.
కారు దిగేదాకా బ్రీఫింగ్.. బ్రీఫింగ్..!
Sunday, November 17, 2024