కడపజిల్లాలో రెండు చోట్ల కూడా తప్పించుకోలేకపోయిన ఓటమి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జీర్ణం కావడం లేదు. దీనికి పరిష్కారంగా వారు కొంతకాలం మౌనం పాటిస్తే సరిపోయి ఉండేది. ఈలోగా.. పరిస్థితులు అన్నీ సర్దుకునేవి. ముందుముందుకూడా ప్రజల తీర్పునకు వెళ్లాల్సి వస్తే.. ఫలితాలు ఇలాగే ఉంటాయనే వాతావరణం వారికి అలవాటు అయ్యేది. కానీ.. వైసీపీ నాయకులకు అంత సహనం లేదు. వారు వెంటవెంటనే.. తమ స్పందనల్ని బయటపెట్టుకుంటున్నారు. ఈక్రమంలో భాగంగా వక్రీకరణలతో, అబద్ధాలు వండి వారుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు.
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేస్తున్న ఆరోపణలేంటంటే..ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలో పోలీసులు అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారట. అందుకు ఆయన మంత్రి రాంప్రసాద్ రెడ్డిని అరెస్టు చేయలేదనే సంగతిని ప్రస్తావిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీని మాత్రం అరెస్టు చేసిన పోలీసులు, అదే సమయంలో తెలుగుదేశానికి చెందిన మంత్రిని మాత్రం అరెస్టు చేయలేదని ఆయన పోలింగు కేంద్రాల వద్దకు రాగలిగారని అంటున్నారు.
ఆయన అర్థసత్యాలతో, అబద్ధాలతో ఈ నిందలను వండి వారుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. పులివెందుల, ఒంటిమిట్ట రెండు చోట్ల ఎన్నికల సందర్భంగా ఏర్పడగల పరిస్థితులును పోలీసులు వేర్వేరు వ్యూహాలతో ఎదుర్కొన్నారు. పులివెందుల అత్యంత సమస్యాత్మక ప్రాంతం గనుక.. దానికి తగ్గట్టుగానే.. అక్కడ చాలా మంది నాయకులను అరెస్టు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి లాగానే తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. అవినాష్ అయినా.. పోలీసుల నిర్బంధం నుంచి వారి కనుగప్పి పారిపోయి జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు గానీ.. తెదేపా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సాయంత్రం దాకా పోలీసు స్టేషన్ లోనే ఉన్నారు.
అయితే ఒంటిమిట్ట ఎన్నికల పరిస్థితి వేరు. ఇక్కడ మరీ అంత తీవ్రమైన పరిస్థితులు లేకపోవడంతో పోలీసులు కొంచెం తేలిగ్గానే తీసుకున్నారు. కాబట్టే మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోలింగు కేంద్రాల వద్దకు రాగలిగారు. బొత్స సత్యనారాయణ వంటి అర్థసత్యాలతో బురద చల్లేవారు అదొక్కటే ప్రస్తావిస్తున్నారు గానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అనేకమంది ఒంటిమిట్టకు సంబంధం లేని సీనియర్ నాయకులు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద హల్ చల్ చేయడం జరిగింది. మాజీ మంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి తదితర నాయకులు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చారు. ఈ ఇరు పార్టీలకు చెందిన నాయకుల్ని కూడా.. పోలీసులు అక్కడినుంచి పంపివేశారు. కాకపోతే.. మంత్రి పోలీసుల మాట విని వెళ్లిపోగా, వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే మాత్రం వారితో గొడవ పెట్టుకుని.. నానా రభస చేసి తర్వాత వెళ్లడం విశేషం.
రెండు చోట్ల దారుణమైన ఓటమితో ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ.. క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవాలు ప్రజలకు చాలా స్పష్టంగా తెలిసినవే అయినప్పటికీ.. వైసీపీ నాయకులు అర్థసత్యాలతో, అబద్ధాలతో వక్రీకరణలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
