మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి.. చులకన చేసేలా మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా వివాదాస్పదం అవుతున్నాయి. ఉద్యోగులను రెచ్చగొట్టేలాగానూ, అవమానించేలాగానూ ఉన్నాయి. కేవలం అవమానం మాత్రమే కాదు.. వారిని బెదిరించేలాగానూ, అహంకారంతో విర్రవీగుతున్నట్టుగానూ కూడా ఉన్నాయి. ‘‘అవసరమైతే కాళ్లు పట్టుకుని అయినా సరే.. సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉద్యోగ సంఘాలకు ఉండాలని’’ బొత్స హితవు పలికారు. ఈ వ్యాఖ్యలపై ఉద్యోగులు ఇప్పుడు మండిపడుతున్నారు. ఉద్యోగులు ఎప్పుడూ కూడా తమ హక్కుల కోసం పోరాడతారని, కాళ్లు పట్టుకుని కాదు కదా.. కాలర్ పట్టుకుని ప్రభుత్వాన్ని అడుగుతారని వారు అంటున్నారు.
ఇంతా కలిపి ఈ మాటలను ఆయన ఉద్యోగ సంఘాల సమావేశంలోనే మాట్లాడడం విశేషం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సభ జరిగితే అందులో బొత్స మాట్లాడారు. వారికి ఇవ్వదగిన సందేశం ఏదో ఇవ్వకుండా.. ఉద్యోగుల పోరాటల ప్రసక్తి తెచ్చారు. సమస్యల పరిష్కారంలో సామ దాన భేద దండోపాయాలు సహజమని, నేరుగో దండోపాయానికి వెళ్లడం కరెక్టు కాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు పీఆర్సీ కోసం పోరాడినప్పుడు.. వారితో చర్చలు జరిపిన మంత్రుల కమిటీలో బొత్స కీలక సభ్యులు. ఆయన మాట తీరు వల్లనే చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్టుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అంత సన్నిహితంగా ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి పోరాటాన్ని గమనించిన ఆయన, ఉద్యోగులు నేరుగా దండోపాయానికి వెళ్లారనే మాట ఎలా అనగలరు. సామ, దాన భేద ఉపాయాలను అసలు ఉద్యోగులు ప్రయోగించనేలేదా? అనేక మార్లు వినతిపత్రాలతో విసిగిపోయి.. ప్రతిపాదనలు పెట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోయాక.. నల్లరిబ్బన్లు ధరించిన నిరసనల వంటి కార్యక్రమాలకు కూడా దిగిరాక భీష్మించుకున్ననప్పుడు మాత్రమే ఉద్యోగులు చివరి ఉపాయానికి వెళ్లారు. వాళ్లు నేరుగా దండోపాయానికి వెళ్లారనే బొత్స మాటలు విన్నప్పుడు.. ఆయనకసలు సామదాన భేద ఉపాయాలనే మాటలకు అర్థం తెలుసా అనే అనుమానం కలుగుతుంది.
ఇక్కడ ఇంకో సంగతి కూడా గమనించాలి. కార్యం చక్కబెట్టుకోవడం గురించి సాధన మార్గాలుగా చెప్పిన ఈ నాలుగు పద్ధతుల్లో బొత్స గారు చెప్పిన కాళ్లు పట్టుకునే పద్ధతి ఎక్కడున్నదో అర్థం కావడం లేదు. ఆయన మానవజాతికి అయిదో మార్గాన్ని ఉపదేశిస్తున్నట్టుగా ఉంది. అయినా కాళ్లు పట్టుకుని బతిమాలడానికి ఉద్యోగులు ముష్టి అడగడం లేదు. హక్కుగా తమకు రావాల్సినది మాత్రమే అడుగుతారు. కాళ్లు పట్టుకుని ఓట్లు అడగడం, ఎన్నికలు ముగిశాక పీక పట్టుకుని పాలించడం.. అధినాయకుల కాళ్లు పట్టుకుని టికెట్లు తెచ్చుకోవడం, పదవులు తెచ్చుకోవడం.. గద్దె ఎక్కిన తర్వాత విచ్చలవిడిగా చెలరేగడం ఇవన్నీ రాజకీయ నాయకులకు ఉండే అలవాట్లు. ప్రజలు, ఉద్యోగులు కాళ్లు పట్టుకుని ఎందుకు అడగాలి? ఇవాళ ప్రజలు కాళ్లు పట్టుకోవలని అన్నవాళ్లు, రేపు రోడ్డు రిపేరు చేయాలనే వినతిపత్రంతో ప్రజలు వచ్చినా ఎమ్మెల్యే కాళ్లు పట్టుకుని అడగాలని అంటారు. అందుకే బొత్స వ్యాఖ్యల పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.