మునిగిపోతున్న నావ వంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కంటె.. రాజకీయ సన్యాసం తీసుకుని.. పూర్తిస్థాయిలో వ్యాపారాలు చూసుకుంటూ గడపడం మేలు అనే భావన ఆ పార్టీలో పలువురిలో కలుగుతున్నట్టుగా వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓడిపోవడం అనేది పెద్ద విషయం కానే కాదు గానీ.. ఆ తర్వాత కూడా జగన్ వ్యవహరిస్తున్న తీరు.. తన తప్పులను తెలుసుకునే ప్రయత్నమే చేయకపోవడం, వాటిని దిద్దుకునే దిశగా ఆలోచన సాగకపోవడం కలిసి పార్టీని పూర్తిగా ముంచేస్తాయనే భయం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు, మాజీలు ఒక్కరొక్కరుగా జారుకుంటున్నారు.
ఒకవైపు మునిసిపల్ కార్పొరేషన్ల మీద వైసీపీ జెండా దిగిపోయి, తెలుగుదేశం జెండా ఎగిరే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గెలిచిన వాళ్లు ప్రస్తుతం జగన్ చెంతనే ఉన్నారు గానీ.. ఓడిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ రకరకాల పునరాలోచనల్లో ఉన్నారు. కొందరు ఇప్పటికే పార్టీని వీడారు. మరికొందరు.. వీడిపోయే బాటలో ఉన్నారు. వీడిన వారిలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి ఇద్దరూ కూడా జనసేనలోకే వెళ్లబోతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
మద్దాళి గిరి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫునే గెలిచారు. తర్వాత ఫిరాయించి వైసీపీలో చేరారు. తీరా అక్కడ ఆయనకు 2024 లో టికెట్ దక్కలేదు. అప్పుడే తెలుగుదేశంలోకి వచ్చి ఉంటే బాగుండేది. టికెట్ ఇవ్వకపోయినా కనీసం కాస్త ఆదరించేవారు. కానీ.. ఆయన ఫలితాల దాకా ఆగారు. గుంటూరు వెస్ట్ ను తెలుగుదేశం చేజిక్కించుకుంది. ఇక మద్దాళిగిరికి అక్కడ ఎంట్రీ లేదు.
కిలారి రోశయ్య పరిస్థితి కూడా అలాంటిదే. ఆయనతో పార్టీ ఓ ఆటాడుకుంది. పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను బలవంతంగా గుంటూరు ఎంపీగా పోటీచేయించారు. డబ్బు ఖర్చయ్యాయే తప్ప ఓటమి తప్పలేదు. ఆయన పార్టీ మీద కినుకగా రాజీనామా చేశారు. పైగా తన మామయ్య ఉమ్మారెడ్డికి జరిగిన అవమానాన్ని కూడా ప్రస్తావించారు. ఆయన పొన్నూరు నియోజకవర్గ నేత కాగా, ధూళిపాళ నరేంద్ర నియోజకవర్గం అయినందున.. అక్కడ తెలుగుదేశంలోకి ఎంట్రీ దొరకదు.
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులు కూడా జనసేనలో చేరడానికే మంతనాలు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వారి చేరికలు వెంటనే ఉండకపోవచ్చునని.. అదను చూసి పార్టీ కండువా కప్పుకుంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
ఆ ఇద్దరూ జనసేనలోకే!
Wednesday, January 22, 2025