బోరుగడ్డ అనిల్ ఒక రౌడీషీటరు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిన రోజుల్లో విచ్చలవిడిగా చెలరేగిన వ్యక్తి. దొంగ ఐడీలు, దొంగ ఐపీలతో సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడం మాత్రమే కాదు. బోరుగడ్డ వారి స్థాయి చాలా పెద్దది. ఆయన ఏకంగా టీవీ చానెళ్ల డిబేట్లలోకి స్వయంగా వచ్చి అక్కడినుంచి అసభ్య పదజాలంతో ప్రత్యర్థి పార్టీల వారినందరినీ తూలనాడుతారు. జగన్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే.. వారిని తూర్పారపట్టడంలో ఆయన సిద్ధహస్తుడు. చంపేస్తానని కూడా బెదిరిస్తాడు. కేవలం రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే కాదు.. చర్చి పాస్టర్లను కలిసి వారినుంచి బెదిరింపుల ద్వారా లక్షలకు లక్షలు పోగేసే విద్యలో కూడా సిద్ధహస్తుడు. అలాంటి బోరుగడ్డ మీద తాజాగా ఒక కేసు నమోదు అయింది. చంద్రబాబు, లోకేశ్ ల మీద సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో కర్నూలుపోలీసులు ఆయనను పీటీవారెంట్ పై తీసుకువచ్చి విచారిస్తున్నారు.
బోరుగడ్డ అనిల్ కుమార్ ఆల్రెడీ ఒక బెదిరింపుల కేసులో అరెస్టు అయి ఉన్నారు. 2021లో కర్లపూడి బాబు ప్రకాష్ ను రూ.50 లక్ష్లలు ఇవ్వాలంటూ బెదిరించినందుకు అప్పట్లోనే కేసు నమోదు అయింది. ఆయన వద్దకు వెళ్లి కత్తిచూపి చంపుతానని మరీ బెదిరించినట్లుగా కేసు నమోదు అయింది. జగన్ పాలన సాగినంత కాలమూ పట్టించుకున్న వారు లేరు. ఆ కేసులో గుంటూరు పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా.. తాను జగన్మోహన్ రెడ్డికి సలహాదారునని, అందుకే తనకు గన్ మెన్ ను కూడా ఇచ్చారని వెల్లడించిన ఘనమైన రౌడీ షీటరు బోరుగడ్డ అనిల్! గుంటూరు పోలీసులు బోరుగడ్డకు స్టేషన్ లోనే రాచమర్యాదలు చేస్తూన్న వీడియోలు కాస్త ఆలస్యంగా ఇవాళే వెలుగులోకి వచ్చాయి.
ఒకవైపు పోలీసులలో మార్పు రాలేదని.. వైకాపా నాయకులకు ఇంకా ఊడిగం చేయడానికి ఎగబడుతున్నారని పవన్ కల్యాణ్ తీవ్రస్వరంతో ఆక్షేపిస్తున్న సమయంలో.. జగన్ ముద్ర ఉన్నందుకు ఒక రౌడీషీటరుకు పోలీసులు సకల మర్యాదలు చేయడం వివాదాస్పదం అవుతోంది.
అదే సమయంలో బోరుగడ్డ మీద సోషల్ మీడియా కేసు కూడా నమోదు అయింది. ఏకేసులోనైనా బోరుగడ్డ అనిల్ కు శిక్షలు పడే అవకాశం ఉన్నది గానీ.. ఆయనకు స్టేషన్లో పోలీసులు సేవలు చేయడమే చిత్రంగా కనిపిస్తోందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
బోరుగడ్డ : ఒకవైపు కొత్త కేసు.. ఇంకోవైపు రాచమర్యాదలు
Wednesday, January 22, 2025