భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అన్ని రకాల రెగులర్ రాజకీయ పార్టీల మాదిరిగానే మారిపోయింది. కేవలం నైతిక విలువలను వదిలేసి, ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, సిధ్దాంత బలం వల్ల కాకుండా, సంఖ్యాబలం ఒక్కటే ప్రధానం అనుకుంటూ రాజకీయాలు చేస్తున్నందువల్ల మాత్రమే కాదు. ఇంకా అనేక రకాలుగా ఇప్పుడు- ఇదివరకటి బిజెపి కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా పరిస్థితులను గమనిస్తే.. ప్రస్తుతం అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిలో తెలంగాణ కూడా ఉంది. ఈ రాష్ట్రాల్లో బిజెపి ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించి.. బరిలోకి ప్రవేశించే తమ సంప్రదాయాన్ని పక్కన పెడుతోంది. తెలంగాణ సంగతి ఓకే. ఇక్కడ ఆ పార్టీకి గెలుపు మీద ఆశల్లేవు. ఇక్కడ ప్రకటించినా, ప్రకటించకపోయినా పెద్దగా తేడా కొట్టదు. అదే సమయంలో రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఇదివరకు నెగ్గి అధికారం వెలగబెట్టిన చరిత్ర కూడా ఉన్నచోట్ల మళ్లీ పవర్ దక్కుతుందనే కలల్లో వారున్నారు. అయితే ముందుగా అభ్యర్థిని ప్రకటిస్తే.. దక్కగల విజయావకాశాలు కూడా దెబ్బతింటాయని భయపడుతున్నారు.
రాజస్థాన్ అసెంబ్లీ బరిలోకి ఇద్దరు కేంద్రమంత్రులు కూడా దిగుతున్నారు గానీ.. ముఖ్యమంత్రి ఎవరనేది మాత్రం పార్టీ ముందుగా చెప్పడం లేదు. ఇదివరకటి రోజుల్లో అయితే.. అంతా పార్టీ క్రమశిక్షణ సిద్ధాంతాలు తెలిసిన నాయకులు మాత్రమే ఉండేవారు. ముఖ్యమంత్రిని ముందుగా ప్రకటించినా.. ఒకటిరెండు చిన్న అసంతృప్తులు తలెత్తినా కూడా.. పార్టీ క్రమశిక్షణకు తలొగ్గి వ్యవహరించేవారు. అయితే ఇటీవలి కాలంలో వలస నాయకులు పెరగడం, పార్టీలో కూడా సిద్ధాంత బలం క్రమశిక్షణ కంటె.. అధికార రాజకీయాలు, వంకర రాజకీయాల జోరు పెరగడంతో నాయకుల్లో కూడా మార్పు వచ్చింది. అభ్యర్థిగా తమ పేరు లేకపోతే గనుక.. పార్టీకి చేటు చేసే పరిస్థితి దాపురించింది. అందుకే సీఎం ఎవరనేది తేల్చి ముందుగా చెప్పకుండా.. ఎన్నికల పర్వం పూర్తి చేసి.. ఆ పిమ్మట కాంగ్రెస్ పార్టీ తరహాలో.. ఢిల్లీ హైకమాండ్ నుంచి సీఎం నియామకాలు చేపట్టవచ్చుననే బాటలో భాజపా కూడా సాగుతున్నట్టు కనిపిస్తోంది.