జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలమూ ఆయన కళ్ళలో ఆనందం చూడడం కోసం వారు తమ అధికార హోదాలను, స్థాయిలను పక్కనపెట్టి బానిసల్లాగా ఆయనకు సేవ చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అధికారం చేతులు మారిన తర్వాత వారి పరిస్థితి కూడా దయనీయంగా తయారైంది. గత ఐదేళ్లలో జగన్ కు సహకరిస్తూ వారు పాల్పడిన అనేక అవినీతి కేసులు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఒకే రోజున జగన్మోహన్ రెడ్డికి వీరవిధేయులు, భక్తులు అయిన ఇద్దరు ఐపీఎస్ అధికారులకు దారుణమైన చేదు అనుభవాలు ఎదురు కావడం విశేషం. ఒకవైపు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్ ను ప్రభుత్వం పొడిగించింది. మరోవైపు సీనియర్ ఐపిఎస్ అధికారి సిఐడి చీఫ్ గా గతంలో సేవలు అందించిన సంజయ్ ఏకంగా జైలు పాలయ్యారు. జగన్ వెంబడి ఉండి చేసిన పాపాలు.. ఎప్పటికీ వారిని వదిలిపెట్టవని ఈ దృష్టాంతాలు నిరూపిస్తున్నాయి.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయి, అత్యంత దయనీయంగా 11 సీట్లకు పరిమితం అయిన తర్వాత.. ఆయనలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకున్నది. ఆయన ఈ ప్రభుత్వంలోని అధికారుల్ని, ప్రత్యేకించి పోలీసుల్ని బెదిరించడానికి వాడే మాటలు చూస్తుంటే మనకు ఈ సంగతి అర్థమవుతుంది. మళ్లీ జగనన్న 2.0 ప్రభుత్వం వస్తుంది.. అప్పుడు వడ్డీతో సహా మీమీద పగ తీర్చుకుంటాం అని ఆయన హెచ్చరిస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టమని, సప్తసముద్రాల అవతల ఉన్నా కూడా తప్పించుకోలేరని ఆయన అధికారుల్ని బెదిరిస్తూ ఉంటారు. ఆయన మాటలు నిజానికి ఇప్పుడు సర్వీసులో ఉన్న అధికారుల్ని అప్రమత్తం చేస్తూ, వారు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఉండేలా తయారుచేస్తే మంచిదే.
కానీ, గత అయిదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని.. రెచ్చిపోయిన అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. వారి పాపాలు ఇప్పుడు పండుతున్నాయి. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టుగా.. అప్పట్లో వారు తమ తప్పులు ఎన్నటికీ బయటకు రాబోవని చెలరేగిపోయారేమో ఇప్పుడు ఆ పాపాలు పండుతున్నాయి. సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, అగ్నిమాపక శాఖ డైరక్టర్ గా ఉంటూ పాల్పడిన అవినీతి బాగోతాలు ఇప్పుడు బట్టబయలయ్యాయి. సుప్రీం దాకా వెళ్లి బెయిలు తెచ్చుకోవడానికి ఆయన నానా ప్రయత్నాలు చేశారుగానీ.. ఫలించలేదు. సుప్రీం సూచన మేరకు ఆయన కోర్టు ఎదుట లొంగిపోగా సెప్టెంబరు 9 వరకు రిమాండు విధించారు. అదే విధంగా.. మరో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేసినందుకు సస్పెన్షన్ లో ఉన్నారు. ఆ సస్పెన్షన్ ను తాజాగా మరో ఆరునెలలు పొడిగిస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. జగన్ ను నమ్ముకున్న అధికారులకు వరుసగా ఎదురుదెబ్బలే తగులుతున్నాయనడానికి ఇవి నిదర్శనాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్ భక్త ఐపీఎస్ లకు చేదు అనుభవాలు
Thursday, December 4, 2025
