ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా విదేశీయాత్రకు వెళ్లనున్నారు. ఏప్రిల్ 20 తేదీన చంద్రబాబునాయుడు 75వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ పుట్టిన రోజు వేడుకలను ఆయన తన కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే విదేశాలలో జరుపుకోవడానికి ప్రత్యేకంగా బయల్దేరి వెళుతున్నారు. అయితే ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న సమయంలో, జీవితంలో ఎంతో ప్రత్యేకమైన 75వ పుట్టిన రోజు నాడు.. చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పాలని అభిమానులు, నాయకులు అందరూ ఆరాటపడడం సహజం. అలాంటి అవకాశం వారికి ఇవ్వకుండా తన కుటుంబంతో మాత్రమే జరుపుకునేలా ఆయన విదేశీయాత్ర పెట్టుకున్నారు. ఏ దేశానికి వెళుతున్నారనే సంగతి కూడా బయటకు సమాచారం తెలియనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే అభిమానుల మద్య కాకుండా విదేశాల్లో బర్త్ డే చేసుకోవాలని చంద్రబాబు ప్రయాణం కావడం వెనుక ఉన్న అసలు కారణం ఆశ్చర్యం కలిగిస్తోంది.
రాష్ట్రంలోనే ఉండి బర్త్ డే చేసుకోవడం పెద్ద విషయమేం కాదు. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో, అధికారంలో ఉన్న కారణం కూడా జత కలిసి.. అభిమానులు చేసే ఆర్భాటం చాలా హంగామా ఎక్కువ అవుతుందని చంద్రబాబు ఆలోచించినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి తనను వ్యక్తిగతంగా కలిసి అభినందించడానికి అభిమానులు, నాయకులు పోటెత్తుతారని, ఎవ్వరినీ కంట్రోల్ చేయడం కూడా సాధ్యం కాదని.. అనవసరమైన ఆర్భాటాలు చోటుచేసుకుంటాయనీ.. ఇవేవీ జరగకుండా నియంత్రించాలంటే.. విదేశాలలో పుట్టిన రోజుు చేసుకోవడం ఒక్కటే తరణోపాయం అని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇలా చేయడం వలన నాయకులు, కార్యకర్తల మీద ఒత్తిడి తగ్గుతుందని.. ఆర్భాటంగా జన్మదినోత్సవాలు చేసుకున్నందుకు ఎవరైనా విమర్శించే అవకాశం కూడా ఉండదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో.. చంద్రబాబునాయుడు 75వ జన్మదినం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా నాయకులు అన్నదాన శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఆర్భాటాలు ఇష్టపడని చంద్రబాబునాయుడు.. కార్యకర్తలను, అభిమానులను కాదనలేక.. అలాగని పుట్టినరోజు పేరుతో హంగామా చేయడం ఇష్టంలేక విదేశాలలో జరుపుకోవాలని బయల్దేరుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే కనీసం ఏ దేశానికి వెళుతున్నారనే సంగతి కూడా ఎవ్వరికీ తెలియనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు.
విదేశాలకు ‘బర్త్ డే బాబు’ : అసలు రీజన్ ఏంటంటే..?
Sunday, April 27, 2025
