భూమన x శ్రీలక్ష్మి :: జగన్ ప్రయారిటీ ఎవరికంటే?!

Friday, December 26, 2025

తిరుపతి మాజీ ఎమ్మెల్యే మరియు తిరుమల తిరుపతి దేవస్థానాల మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెర్సస్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మి రాష్ట్రంలో ఇప్పుడు యుద్ధం మొదలైనట్టే! ఆమె వైపు నుంచి స్పందన లేదు గానీ.. భూమన తన వైపునుంచి యుద్ధం ప్రకటించేశారు. అయితే, ఈ ఇద్దరిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎవరు ముఖ్యులు? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న. అంత తొందరగా సమాధానం దొరికే ప్రశ్న కాదు ఇది. మామూలు పరిస్థితులలో అయితే ఈ  ప్రశ్నకు జవాబు దొరికేదేమో గాని.. తాజా పరిణామాలలో శ్రీ లక్ష్మీ గురించి, తాటకి, పూతన, లంకిణి, అవినీతి అనకొండ, 50 లక్షల రూపాయల విలువైన విగ్గులు పెట్టుకుని తిరిగే అవినీతిపరురాలు..  అంటూ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేసిన నేపథ్యంలో పై ప్రశ్నకు సమాధానం ఠక్కున దొరుకుతుంది. బయటపడి చెప్పకపోయినప్పటికీ, ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టకపోయినప్పటికీ వీరిద్దరి మధ్య తనకు శ్రీలక్ష్మి ముఖ్యం,  తన ప్రయారిటీ ఆమెకే.. అని జగన్మోహన్ రెడ్డి సంకేతాలు ఇచ్చేశారు.

సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు ఏదైనా కొత్త అంశం లేవనెత్తి విమర్శలు కురిపిస్తే గనుక దానిని రాష్ట్రం మొత్తం మిగిలిన నాయకులు అందరూ కూడా అందిపుచ్చుకుంటారు. ఆ మాటలకు మద్దతుగా తమ వ్యాఖ్యానాలు జోడిస్తూ ఎడాపెడా చెలరేగిపోతారు అయితే ఇప్పుడు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.

శ్రీలక్ష్మి మీద విమర్శలు చేసిన వ్యవహారంలో భూమన కరుణాకర్ రెడ్డి పార్టీలో దాదాపుగా ఒంటరి అయ్యారు. ఆయన వ్యాఖ్యలకు ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు. ఆయనకు అండగా నిలబడడం లేదు. కనీసం తిరుపతి వైసీపీ నాయకులు గానీ, ఎంపీ గురుమూర్తి గాని, తిరుపతి టిడిఆర్ బాండ్ల కుంభకోణంలో ప్రబలంగా వినిపించే మరో నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గానీ ఎవ్వరూ భూమనకు అనుకూలంగా గళం విప్పడం లేదు. శ్రీలక్ష్మి అవినీతిని ప్రశ్నించడం లేదు. పైగా సాక్షి దినపత్రికలో కూడా భూమన వ్యాఖ్యలను పూర్తిగా పక్కన పెట్టేశారు. మామూలుగా అయితే.. భూమన కరుణాకర రెడ్డి ఏం మాట్లాడినా సరే.. సాక్షిలో లైవ్ వస్తుంటుంది. ఒక పట్టాన ఆ లైవ్ ప్రసంగాన్ని కట్ చేయరు కూడా. లైవ్ నడుస్తుండగా.. ఆయన చెప్పదలచుకున్న విషయం ముగిసిపోయి.. లైవ్ కట్ కాకపోవడం వలన.. ఆయన చెప్పిన సంగతులనే చెప్పుకుంటూ గంటపాటూ సాగదీస్తూ ప్రభుత్వాన్ని,టీటీడీని నిందిస్తూ గడుపుతారు. కానీ.. శ్రీలక్ష్మి వ్యవహారంలో ఆయన మాటలకు అసలు చానెల్లో దిక్కులేకుండాపోయింది.
ఈ చర్యల ద్వారా భూమన- శ్రీ లక్ష్మీ ఇద్దరిలో తనకు శ్రీలక్ష్మి ఎంతో ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి పార్టీకి స్పష్టమైన సంకేతాలు పంపారని అర్థమవుతుంది. శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా ఎవరు గళం విప్పినా పార్టీలో వారి భవిష్యత్తు తేడాగా ఉంటుందనే భయం కూడా కార్యకర్తల్లో ఏర్పడుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles