ఇటీవలి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కి ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే, ఆ పార్టీ పతనం షురూ అయిందని రాష్ట్రలో అనేకమంది నమ్ముతున్నారు. 151 సీట్లనుంచి ఏకంగా 11 సీట్లకు పార్టీ పడిపోవడం అనేది కేవలం స్వయంకృతం అని, ఇది పూర్తిస్థాయి పతనానికి దారితీస్తుందని అంటున్నారు. దానికి తగ్గట్టుగా పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచన కూడా తమలో లేనట్టుగా.. చాలా మంది సీనియర్ నాయకులు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇప్పటి దాకా జగన్ నిర్ణయాలే పార్టీ పతనాన్ని శాసిస్తున్నాయని ఆ పార్టీలో అందరూ అనుకుంటూ ఉండగా.. ఇప్పుడు తిరుమల లడ్డూల్లో నెయ్యి కల్తీ వివాదం తోడైంది. కల్తీ నెయ్యి వివాదంతో జగన్ రాజకీయజీవితం అంత తప్పదని ఆయన సొంతవారే భయపడుతున్నారు. ఆ భయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు కూడా. జగన్ కు అత్యంత ఆత్మీయుల్లో ఒకడు.. పార్టీ ఓడిపోయే ముందు టీటీడీకి ఛైర్మన్ గా కూడా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి మాటలు గమనిస్తే ఇలాగే అనిపిస్తుంది.
జగన్ ను రాజకీయంగా అంతం చేసేందుకు చంద్రబాబునాయుడు నెయ్యి కల్తీ కుట్ర పన్నారని అంటున్నారు. ఈ మాటలతో ఒక్క విషయం స్పష్టమవుతోంది. నెయ్యి కల్తీ వివాదం అనేది జగన్ రాజకీయ అంతానికి దారితీసే తప్పిదం అని ఆయన అనుంగు సహచరులే నమ్ముతున్నారన్నమాట. అందుకే వారిలో కంగారు ఎక్కువగా ఉంది. భయపడుతున్నారు.
తిరుమలేశునికి కళంకం అంటగడుతున్నారని అంటున్న భూమన మాటల్లో ఏమాత్రం ఔచిత్యం లేదు. కళంకం అంటుతున్నది శ్రీవారికి కాదు.. అప్పట్లో స్వామివారి బాధ్యతలు చూసిన ట్రస్టుబోర్డుల సారథులు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి లకు మాత్రమే. ఆ విషయం భూమనకు కూడా స్పష్టంగా తెలుసు. కాకపోతే.. మీడియాముందు ఎవరో ఒకరు దబాయించాలి గనుక.. ఆయన అలా దబాయిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ.. ఒక్కచాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టిన సమయంలో ఏపీ ప్రజలు చాలా మందే జగన్ మీద జాలి చూపించారు. ఆయన సీఎం అయ్యారు. గతంలో జగన్ మీద ప్రజల్లో జాలి ఎవరికున్నది? ద్వేషం ఎవరికున్నది? అనే చర్చతో నిమిత్తం లేకుండా.. ఇప్పుడు దేశంలోని హిందువులందరూ, వెంకటేశ్వరస్వామి భక్తులందరూ జగన్మోహన్ రెడ్డి వైఖరిని అనుమానాస్పదంగా చూస్తున్నారు. ఈ తప్పుతో తమకు సంబంధం లేదని చాటుకోవడానికి వారికి దారులు దొరకడం లేదు. కోర్టు కేసులు, ప్రధానికి లేఖ వంటి పనులతో డ్రామా నడిపిస్తున్నారు. దైవద్రోహం చేశారనే నమ్ముతున్న ప్రజలు ఖచ్చితంగా జగన్ రాజకీయ జీవితానికి మరణశాసనం లిఖిస్తారని అందరికీ అర్థమవుతోంది.