తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అవినీతి దందాలలో ఆమెకు అనల్పమైన పాత్ర ఉంది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డికి ప్రతి దందాలోనూ సహకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఆమె అనేక కేసుల్లోనూ ఉన్నారు. జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆమెకు ప్రాధాన్యం ఇవ్వడం వలన, అచ్చంగా అవినీతిపరులకు అందలం అందించినట్లుగా.. ప్రజల్లోకి సంకేతం వెళుతుందని స్పష్టంగా తెలిసినప్పటికీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెను నెత్తిన పెట్టుకున్నారు. ఇన్ని రకాలుగా జగన్ ఆమెకు ప్రయారిటీ ఇచ్చినప్పటికీ భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం ఇవాళ ఆమె అవినీతి దందాల మీద ఒక రేంజిలో ఫైర్ అయ్యారు.
తమ పార్టీ అధినేతకు అత్యంత ఆత్మీయురాలైన ఐఏఎస్ అధికారి మీద ఆయన విరుచుకు పడడానికి కారణం ఏమిటి? అనే సందేహం సాధారణంగానే ప్రజల్లో కలుగుతుంది. అయితే టిడిఆర్ బాండ్ల రూపంలో తాను కాజేయదలుచుకున్న మొత్తంలో కూడా ఆమె వాటాలకు పట్టుబట్టి వసూలు చేయడం వల్లనే భూమన ఇవాళ ఇంతగా రెచ్చిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ జమానాలో మునిసిపల్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారిని వై శ్రీలక్ష్మి సాగించిన దందాల గురించి సాక్షాత్తు వైసిపి సీనియర్ ఎమ్మెల్యే మాట్లాడడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనాంశంగా ఉంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించిన అయిదేళ్ల కాలంలో.. అగ్ర నాయకులు, ప్రభుత్వంలోని పెద్దలు ఎన్నెన్ని రూపాల్లో విచ్చలవిడిగా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారో ప్రజలకు తెలుసు. వాటన్నింటి మీద రకరకాల కేసులు నమోదు అయ్యాయి. కొన్నింటిలో నివేదికలుసిద్ధం అవుతున్నాయి. రకరకాల దశల్లో ఉన్నాయి. అయితే తమ పార్టీ కార్యకర్తలు, క్షేత్రస్థాయిలోని చోటా బడా నేతలు కూడా వారి లెవెల్లో వారు దోచుకోవడానికి తెచ్చిన అనేక పథకాల్లో టీడీఆర్ బాండ్లు కూడా ఒకటి. టీడీఆర్ బాండ్ల రూపేణా ఎమ్మెల్యేల అనుచరులు వేలాది కోట్లరూపాయలు దోచుకున్నట్టు విమర్శలున్నాయి. ఒక్క తిరుపతిలోనే దాదాపు రెండు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి.
తిరుపతిలో టీడీఆర్ బాండ్ల దందాలు మొత్తం అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల దోపిడీపర్వంగా సాగింది. అయితే ఈ విషయంలో వాటాలుగా తాను దోచుకోదలచుకున్న మొత్తం విషయంలో అప్పటి మునిసిపల్ శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మితో భూమనకు పేచీ వచ్చినట్టుగా వినిపిస్తోంది. తాను జగన్ కు ఎంతో సన్నిహితుడైన ఎమ్మెల్యే అయినప్పటికీ తన వద్దనుంచి కూడా ఆమె వాటాలు వసూలు చేసిందని, ఆ ఆగ్రహంతోనే ఇప్పుడు ఆయన అదనుచూసి నిప్పులు చెరగుతున్నారని పలువురు అంటున్నారు. కానీ.. శ్రీలక్ష్మిని భూమన ఏం తూలనాడినప్పటికీ.. ఆమె అవినీతి మొత్తం జగన్ కు కూడా చుట్టుకుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
వాటాలు అడిగినందుకే లంకిణిపై భూమనకు కోపం!
Thursday, December 4, 2025
