రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే దానర్థం ఏమిటన్నమాట? చిన్న భార్య చెడ్డదనే కదా? ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా? ఇది అందరికీ తెలిసిన నీతి. ఇప్పుడు తిరుమల స్వామివారి లడ్డూ తయారీకి కల్తీనెయ్యిని ఉపయోగిస్తున్న వైనంలో కూడా అలాంటిదే జరుగుతోంది. నెయ్యి టెండర్లలో అయినవారికి కట్టబెట్టడానికి టీటీడీ బాధ్యతలు చూసిన వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణగా.. ఇద్దరిలో ఒకరు ఇప్పుడు ప్రమాణం చేసేశారు. అంటే ఏమిటన్నమాట.? రెండో వ్యక్తి తప్పుచేశాడని పరోక్షంగా చెబుతున్నట్టే కదా అని ప్రజలు అనుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి అరాచక అయిదేళ్లపాలనలో టీటీడీకి తొలి రెండు పర్యాయాలు ఛైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి వ్యవహార సరళి తొలినుంచి అత్యంత వివాదాస్పదంగానే నడిచింది. ఆయన నాలుగేళ్లు పనిచేసిన తర్వాత.. భూమన కరుణాకర రెడ్డి గత ఏడాది ఆగస్టులో ఛైర్మన్ అయ్యారు. అయితే ఇప్పుడు కల్తీ నెయ్యి వివాదం రాగానే.. ఇద్దరు ఛైర్మన్ల మీద కూడా విమర్శలు వచ్చాయి. ఈ ఆరోపణల వల్ల తన మనసు కలత చెందుతోందని, నిప్పుల కొలిమిలో ఉన్నట్టుగా ఉన్నదని, కలుషిత మనస్కులు ఈ ఆరోపణలు చేశారని అంటున్న భూమన… తిరుమల వచ్చి దేవుడి ఆలయం ఎదుట ప్రమాణం చేశారు. తన హయాంలో ఎలాంటి అక్రమాలకు అవినీతికి పాల్పడలేదని, నెయ్యి కల్తీ లతో తనకు సంబంధం లేదని ఆయన ప్రమాణం చేశారు. కొడుకు అభినయ్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి లను కూడా వెంటబెట్టుకుని వచ్చిన భూమన కరుణాకరరెడ్డి.. తాను ఏ తప్పు అయినా చేసి ఉంటే.. తన కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుందని ఆవేశంగా అనడం గమనార్హం.
కానీ నాలుగేళ్లు ఛైర్మన్ గా పనిచేసిన.. కాంట్రాక్టునిబంధనలు మార్చడం దగ్గరినుంచి కల్తీ నెయ్యికి సంబంధించి కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న వైవీ సుబ్బారెడ్డి మాత్రం నోరు మెదపడం లేదు. ఇంకా చిత్రంగా ఆయన చంద్రబాబు వచ్చి తడిబట్టలతో ప్రమాణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భూమన కోనేటిలో మునిగి తడిబట్టలతో వచ్చి ప్రమాణం చేసిన తరువాత.. వైవీ ఇరుకున పడ్డట్టే. ఆయనకూడా భూమనలాగా ప్రమాణం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. చేయకపోతే పాపం ఆయనదే అని ప్రజలు నమ్ముతున్నారు కూడా!