ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి ఏ స్థాయిలో పరుగులు పెడుతుందో అప్పుడే ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశవ్యాప్తంగా 12 ప్రధాన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపితే.. వాటిలో మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండడం అద్భుతమైన సంగతి. ఈ మూడింటికి కలిపి దాదాపు రెండేళ్ల వ్యవధిలో 19 వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయనున్నారు. ఈ పనులన్నీ ఆ తర్వాత ఒక ఏడాది కాలవ్యవధిలో అందుబాటులోకి వచ్చినప్పటికీ.. రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర సమగ్ర ముఖచిత్రం రూపురేఖలు మారిపోతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాబు సర్కారు సాధించిన అపూర్వ విజయం పట్ల అభినందనలు తెలియజేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణ పనులు పూర్తి చేయడానికి 12 వేల కోట్ల రూపాయలు అందించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు సంవత్సరాల్లో రెండు విడతలుగా ఈ సాయం అందుతుంది. అయితే 2027 ప్రారంభం నాటికి పోలవరం తొలిదశ పనులు పూర్తి చేసి తీరాలని.. లేకపోతే మిగిలిన నిధులు విడుదల చేయబోయేది కూడా లేదని కేంద్రం తేల్చి చెప్పింది. అసలు పోలవరం తొలిదశ పూర్తి కావడానికి చంద్రబాబు సర్కారు రూపొందించిన తాజా 30 వేల కోట్ల రూపాయల డీపీఆర్ ను కేంద్రం ఆమోదించడమే చాలా పెద్ద విషయం.
పోలవరానికి తోడు కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక. నగరాల అభివృద్ధికి కేంద్రం పచ్చజెండా వూపింది. ఈ రెండింటికి దాదాపు అయిదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. ఈ రెండింటిలో కలిపి 20 వేలకోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని.. సుమారుగా లక్ష మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రం మారిపోతుందని అనడంలో సందేహం లేదు.