రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. వాటిని నాయకులు కూడా అంతే సహజంగా తీసుకోవాలి. ఓడిపోయిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రకరకాల సుద్దులు చెబుతున్నారు. అహంకారంతో ప్రవర్తించకూడదని తెలుగుదేశం వారికి నీతులు చెబుతున్నారు. అహంకారం లాంటి లక్షణాల గురించి మాట్లాడగల నైతిక హక్కు తమకు ఉందో లేదో వారికి అర్థమైనట్లు లేదు. రాజకీయాల్లో అధికారం అటూ ఇటూ మారుతూ ఉండడం మామూలే అని అంటున్నారు. ఏ నిజాన్నయితే నమ్మడానికి వారు ఇబ్బంది పడుతున్నారో.. అదే నిజాన్ని నీతిగా ఎదుటివారికి ప్రవచించడం వారికి మాత్రమే చెల్లుతోంది.
ఎదుటివారికి నీతులు చెబుతున్నారు గానీ.. ఇప్పుడు ఎదురైన ఓటమిని రోజులు గడుస్తున్నా ఇంకా సహించలేని, ఎదుటి వారి విజయాన్ని ఓర్వలేకపోతున్న వ్యక్తిగా జగన్ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఓటమి ఆయనకు షాక్ కలిగించి ఉండవచ్చు. కానీ అందులోంచి తేరుకుని, గెలిచిన వారిపట్ల సగౌరవంగా వ్యవహరించడం అలవాటు చేసుకోవాలి. కానీ జగన్ కు అది చేతకాలేదు.
యావత్తు భారత దేశంలో ఏ రాష్ట్ర శాసనసభలో అయినా సభాపతి ఎన్నిక తర్వాత ఆయన తన స్థానాన్ని స్వీకరించే ఘట్టం చాలా గౌరవప్రదమైనది. ప్రజాస్వామ్యం యొక్క విలువను చాటిచెప్పే సందర్భం అది. సభలో ఉండే అన్ని రాజకీయ పార్టీల నాయకులు.. కలిసి కట్టుగా సభాపతిని తోడ్కొని వెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టడం సాంప్రదాయం! కానీ జగన్మోహన్ రెడ్డి ఆ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కేశారు. సభాపతి పట్ల తన అమర్యాదను చాటుకున్నారు. సభకు తన పార్టీ సభ్యులు మొత్తం హాజరుకాకుండా చూశారు. తెలుగుదేశం ప్రభుత్వం చాలా పద్ధతిగా శుక్రవారం నాడే ఆయనకు అధికారికంగా సమాచారం ఇచ్చారు. పెద్దిరెడ్డితో పయ్యావుల కేశవ్ స్వయంగా స్పీకరు ఎన్నిక సంగతి చెప్పి, ఆ పార్టీ నాయకుడిగా జగన్ వచ్చి పాల్గొనాల్సిందిగా కోరారు. కానీ ఆ మర్యాదను పాటించే అలవాటు, సద్బుద్ధి తనకు లేదని జగన్ నిరూపించుకున్నారు. ఆ రకంగా ప్రజాస్వామ్య గౌరవాన్ని, సభా సాంప్రదాయాన్ని మంటగలిపేసిన అనాగరిక నాయకుడిగా జగన్ పేరు తెచ్చుకున్నారు. ప్రజాస్వామ్యం గురించి దేవుడి గురించి జనాంతికంగా డైలాగులు వల్లించడం కాదు. ఆచరణలో తనకు మర్యాద తెలుసునని, గౌరవం కాపాడుకోవడం తెలుసునని నాయకులు నిరూపించుకోవడం ముఖ్యం. కానీ జగన్ కు ఆ సంగతి ఇప్పటికీ తెలియడం లేదు.
అనాగరిక నాయకుడు జగన్ రెడ్డి!
Sunday, December 22, 2024