సీక్రెట్ చెప్పిన బాలినేని : కౌంటర్లు వేసే ధైర్యం లేదు!

Sunday, January 26, 2025

ఎవ్వరైనా సరే.. జగన్మోహన్ రెడ్డి మీద కించిత్తు విమర్శ చేస్తే ఆయన అనుచరగణాలు విరుచుకుపడిపోతారు. పార్టీ నాయకుల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నారో వారందరికీ ఫోన్లు వెళ్లిపోతాయి. ఆ స్క్రిప్టుల ప్రకారం ఆయా నాయకులు ప్రెస్ మీట్లు పెట్టేసి తమ ప్రత్యర్థులను ఖండించే పనిలో ఉంటారు. కానీ ఇవాళ జగన్ వందిమాగధులందరూ మూగనోము పాటిస్తున్నారు.  స్వయానా జగన్ మామయ్య బాలినేని శ్రీనివాసరెడ్డి బయటపెట్టిన సీక్రెట్ విషయంలో ఖండన ముండనలు చేయడానికి ఆ పార్టీ నాయకులు ఎవ్వరికీ ధైర్యం చాలడం లేదు. ఈ ప్రకటనను ఖండిస్తే.. అసలే ప్రస్తుతం జనసేనలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి మరెన్ని సీక్రెట్లు బయటపెడతారోర అనే భయం వారిని వెన్నాడుతోంది. ఇంతకూ బాలినేని బయటపెట్టిన సీక్రెట్ ఏమిటి?

అదానీ నుంచి 1750 కోట్ల రూపాయల లంచాలను తీసుకుని జగన్మోహన్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకితో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారనేది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న హాట్ వ్యవహారం. ఈ విషయం ఇక్కడ రాజకీయ ఆరోపణలుగా పుట్టినది కానే కాదు. అమెరికాలో అక్కడి అత్యున్నత నేర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ రెండు సంవత్సరాల పాటు పరిశోధించి నిగ్గుతేల్చిన సంగతి ఇది. దీనికి సంబంధించి.. అదానీ గ్రూపునకు చెందిన పలువురిపై అమెరికా చట్టాల కింద కేసులు కూడా నమోదు అయ్యాయి. ఇండియాలో నాలుగు రాష్ట్రాల అధినేతలకు సెకితో ఒప్పందాలు చేసుకునేలా ప్రలోభపెట్టడానికి సుమారు 2150 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చారనేది ఎఫ్‌బిఐ తేల్చిన సంగతి. అయితే ఆ నిధులను అమెరికాలో వక్రమార్గాల్లో సమీకరించారు గనుక.. అక్కడి చట్టాల ప్రకారం కేసులు నమోదు అయ్యాయి.

ఇక్కడకే జగన్ పరువు బజార్న పడింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న క్రెడిబిలిటీ ఏకంగా అమెరికాలో కూడా ఈ స్థాయి భారీ అవినీతి తిమింగలంగా నిగ్గుతేలడం అనేది తెలుగు ప్రజలకే అవమానంగా కనిపిస్తున్న సంగతి.
ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సుద్దపూస అని చెప్పుకోవడానికి వైసీపీ వారు ప్రయత్నిస్తున్నారు. ఒప్పందం సెకితో అయితే అదానీ లంచాలు ఎందుకు ఇస్తాడు అంటున్నారు. కానీ.. అప్పట్లో విద్యుత్తుశాఖకు మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి బాంబులాంటి సీక్రెట్ బయటపెట్టారు. అప్పట్లో తనకు అర్ధరాత్రి ఒటిగంటకు ఫోను చేసి సెకితో ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టాల్సిందిగా ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ చెప్పారని.. అసలు ఒప్పందం గురించి వివరాలు ఏమీ తెలియకుండా తాను సంతకాలు పెట్టను అని చెప్పేసరికి.. ఆ మరురోజు కేబినెట్ ఎదుట ఫైల్ పెట్టించారని.. ఆ రకంగా తన సంతకం ఒక్కటి కూడా లేకుండానే.. సెకితో ఒప్పందం జరిగిపోయిందని బాలినేని అంటున్నారు. ఒక్కసంతకం పెట్టి ఉన్నా ఇవాళ తన పరిస్థితి ఇబ్బందిగా మారి ఉండేదని అంటున్నారు. జగన్ పాలన కాలంలో లిక్కరు, ఇసుక సహా సమస్త అవినీతి కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఈ సెకి ఒప్పందం వెనుక కూడా ఉన్నట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి పరోక్షంగా ప్రస్తావించడం విశేషం.

స్వయంగా బాలినేని ఈ విషయం చెప్పేసరికి జగన్ అవినీతిని మరింతగా ధ్రువరిచినట్లు అయింది. అయితే బాలినేని ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ దళాలు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఇతర నాయకులైతే ఈ పాటికి చాలా ఎదురుదాడి ఉండేది. బాలినేని అప్పట్లో విద్యుత్తు మంత్రి కావడం.. జగన్ హయాంలో సెకి మాత్రమే కాకుండా.. అనేక విద్యుత్తు ఒప్పందాల విషయంలో కూడా ఇంకా అనేక ఆరోపణలు ఉండడంతో వాళ్లు జాగ్రత్త పడుతున్నారు. బాలినేనిని కెలికితే.. అప్పటి ప్రతి ఒప్పందం గురించి.. తెరవెనుక బాగోతాల గురించి నిజాలు బయటపెడతారేమో అని భయపడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles