దాదాపు ఆరు నెలల సుదీర్ఘ జైలు జీవితం తరువాత.. గులాబీ తనయ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీనియర్ న్యాయవాది రోహత్గీ ఆమె తరఫున సుప్రీం లో వాదనలు వినిపించారు. కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే తిష్ట వేసి మరీ, లాయర్లతో మంతనాలు సాగించి మొత్తానికి తమ నాయకురాలిని బయటకు తీసుకువచ్చారు. బెయిల్ తర్వాత సహజంగానే రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలు రకరకాలుగా వినిపిస్తూ ఉంటాయి. అయితే గులాబీ నాయకుల స్పందన కూడా ముందే భుజాలు తడుముకుంటున్నట్టుగా ఉంది.
కవితకు బెయిల్ కోసం భారాస, కేంద్రంలోని బిజెపి తో కుమ్మక్కు అవుతున్నదని.. ఆ పార్టీలో విలీనం కాబోతున్నదని కాంగ్రెస్ నాయకులు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత విమర్శలకు ఎంత తక్కువ స్పందిస్తే అంత బాగుంటుంది. అయితే ఒక రకమైన అసహనంలో ఉన్న భారాస నాయకులు వాటిని ఖండించడంలో రెచ్చిపోతూ వచ్చారు. ఈ క్రమంలోనే బెయిలు వచ్చిన తర్వాత కూడా అలాగే మాట్లాడుతున్నారు.
భారాస నాయకుడు వినోద్ మాట్లాడుతూ కవితకు చట్టప్రకారమే బెయిలు వచ్చిందని అంటున్నారు. ఆ మాట వరకు ఆయన పరిమితమై ఉంటే బాగుండేది. అక్కడితో ఆగకుండా, బీజేపీకి లొంగి ఉంటే బెయిలు ఎప్పుడో వచ్చి ఉండేదని అంటున్నారు. ఇది ఒకరకంగా.. ఇన్నాళ్ల తర్వాత యిప్పుడు లొంగిపోబట్టి మాత్రమే బెయిలు వచ్చిందని అర్థం వచ్చేలా ఉంది. గులాబీ దళం.. కమల దళం లో విలీనం అవుతుందో లేదో తర్వాతి సంగతి.. కానీ వారి మాటలు మాత్రం, భుజాలు తడుముకుంటున్నట్టుగా, కొత్త అనుమానాలు పుట్టించేలా ఉన్నాయి.