చంద్రబాబునాయుడు చెబుతున్నది నిజమే. జగన్మోహన్ రెడ్డి సర్కారు కొన్ని చిన్న చిన్న ప్రజావసరాలకు రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా చాలా సందర్భాల్లో పట్టించుకోలేదు. లక్షల్లో ఖర్చులు పెట్టి రోడ్లను మరమ్మతు చేయించడానికి కొన్ని సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వానికి మనస్కరించలేదు. కానీ ఒకే ఒక్క కేటగిరీ కింద ఈ అయిదేళ్లలో వందల కోట్ల రూపాయల వృథా ఖర్చు పెట్టారు. చంద్రబాబు చెబుతున్న మాట, చేస్తున్న విమర్శ కూడా నిజమే. జగన్ చేసిన ఆ వృథా ఖర్చులతో కొన్ని ప్రాజెక్టులే పూర్తిగా కట్టేసి ఉండొచ్చు.
జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉద్యోగాల కల్పన, ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఏమాత్రం పట్టించుకోలేదని అనేకవర్గాల నుంచి ఉన్న పెద్ద విమర్శ. ఆయన సొంత చెల్లెలు షర్మిల అయితే ఈ విషయంలో జగన్ మీద అనేకానేక విమర్శలు గుప్పిస్తున్నారు. చుక్కనీరు అదనంగా ఇచ్చేలాగాఅయినా.. ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించారా అని దుమ్మెత్తిపోస్తున్నారు. అలాగే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు తప్ప ఆయన ఈ అయిదేళ్లలో ఇచ్చిన ప్రభుత్వోద్యోగం ఒక్కటీ లేదు. అలాగే నిర్మించిన ప్రాజెక్టు కూడా లేదు. ఇంతకీ చంద్రబాబునాయుడు ప్రస్తావిస్తున్న వందల కోట్ల వృథా దేని గురించో తెలుసా? సలహాదార్లు గురించి!
జగన్ సర్కారు ఏర్పడిన తర్వాత.. ప్రభుత్వ సలహాదార్లు అనే డిజిగ్నేషన్ తో లెక్కకు మిక్కిలిగా మందిని నియమించేసున్నారు. తనను ఆశ్రయించి గతంలో పనిచేస్తూ ఉండిన వాళ్లు, తొత్తులు, తైనాతీలు, అందరికీ ఆయన సలహాదార్లుగా అవకాశాలు కల్పించేశారు. అందరి డిజిగ్నేషన్లు సలహాదారులే..! అంతమంది ప్రభుత్వానికి ఏం సలహాలు ఇస్తారో తెలియదు. వారందరి సలహాలు తీసుకుంటే తప్ప పనిచేయడం చేతకాని మూర్ఖ ప్రభుత్వం ఎలా మనుగడ సాగిస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. అసలు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికే కదా.. ఐఏఎస్ అధికార్లు ఉంటారు. వారిని మించి సలహాలు ఇవ్వడానికి పదులసంఖ్యలో జగన్ కు మనుషులు ఎందుకు అవసరం పడ్డారో తెలియదు. అసలు వారేం సలహాలు ఇస్తారో కూడా తెలియదు.
జగన్ తన పత్రిక సాక్షికి ఎడిటర్ గాచేసిన రామచంద్రమూర్తిని సలహాదారుగా పెట్టుకుంటే.. ఇక్కడ సలహాలు ఇచ్చినా తీసుకునే వాళ్లు లేరని ఆయన ఛీకొట్టి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయినా సరే.. అనేకమంది సలహాదార్ల రూపేణా జగన్ ఈ అయిదేళ్ల పదవీకాలంలో అయిదువందల కోట్ల రూపాయలకు పైగా తగలేశారని లెక్కలు చెబుతున్నాయి. ఈ సొమ్ముతో ఒక ప్రాజెక్టు ఏమిటి.. రెండు మూడు నీటి ప్రాజెక్టులు కట్టవచ్చునని ప్రజలు అంటున్నారు. చంద్రబాబు తన మాటలతో ప్రజల్లో కొత్త ఆలోచన రేకెత్తిస్తున్నారు.
బాబుమాట నిజమే ఆ వృథాతో ప్రాజెక్టులే కట్టేయొచ్చు!
Sunday, November 24, 2024