తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని ఎవరైనా భావిస్తూ ఉండవచ్చు గాక! మొత్తంగా శిధిలమైనా సరే ఆ శకలాల నుంచి పార్టీని పునర్నిర్మించగల పట్టుదల అధినేత చంద్రబాబు నాయుడు సొంతం అనే సంగతి కొందరికి మాత్రమే తెలుసు. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి తిరిగి జవజీవాలు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు నడుం బిగించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒకవైపు తీవ్రమైన పనుల ఒత్తిడిలో ఉంటున్నప్పటికీ తెలంగాణ పార్టీ కోసం ఆయన కొంత సమయాన్ని కేటాయించగలుగుతూ ఉండటం విశేషం. ప్రతి రెండు వారాలకు ఒకసారి హైదరాబాదు వచ్చి నాయకులతో సమావేశం అయ్యేందుకు ప్రయత్నిస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం చాలా పెద్ద సంగతి. ఒక వ్యూహం ప్రకారం తెలంగాణ తెలుగుదేశం పార్టీని మళ్లీ బతికించడానికి చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. అందుకు త్వరలో జరగబోయే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలను వేదికగా ఎంచుకుంటున్నట్టుగా కనిపిస్తుంది.
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో పూర్తిగా కొత్తదనంతో నింపడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. ఆమేరకు పార్టీ వివిధ విభాగాలకు ప్రస్తుతం ఉన్న అన్ని కమిటీలను కూడా ఆయన రద్దు చేశారు. నాయకులందరూ ముందు సభ్యత్వ నమోదు కార్యక్రమం మీద దృష్టి పెట్టాలని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన యువతరాన్ని గుర్తించి వారికి వివిధ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అంటే సభ్యత్వ నమోదు అనేది పార్టీ పదవులకు ఒక గీటురాయిలాగా పరిగణించి నాయకుల సామర్థ్యాన్ని లెక్క వేస్తారన్నమాట. సభ్యత్వ నమోదు గణనీయంగా పెరగడం కోసం ప్రత్యేక యాప్ ద్వారా ఆన్లైన్ సభ్యత్వ నమోదు ఏర్పాటును కూడా చేశారు.
గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత.. తెలంగాణలో పార్టీ సంగతి ఇక మరిచిపోవచ్చు అని ప్రత్యర్థులు ప్రచారం చేసుకున్నారు. అయితే వారి వ్యాఖ్యలకు రెచ్చిపోకుండా సంయమనం పాటించిన చంద్రబాబు.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను నెత్తిన వేసుకున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చే స్థాయికి తెలంగాణ తెలుగుదేశాన్ని తీర్చిదిద్దాలని చంద్రబాబునాయుడు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి క్రమక్రమంగా బలహీనపడుతూ ఉండడం తెలుగుదేశానికి కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ మీద గత ఎన్నికల సమయంలో అలిగిన సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తాజాగా చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం కూడా గమనించాల్సిన సంగతి. పార్టీ కొద్దిగా అడుగులు వేసిన తర్వాత ఇతర పార్టీల నుంచి మరింత మంది నాయకులు తెలుగుదేశం లోకి వచ్చే అవకాశం ఉన్నది అని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు.