జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఏ చట్టం గురించి అయితే రాష్ట్రంలోని ప్రజలందరేూ కూడా అపరిమితంగా భయపడిపోయారో.. ఏ చట్టం అయితే జగన్మోహన్ రెడ్డి సర్కారుకు మరణశాసనం లిఖించిందో అలాంటి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని చంద్రబాబునాయుడు ప్రభుత్వం రద్దుచేసింది. ఎన్నికల ప్రచార సమయంలోనే ఈ చట్టం రద్దు ఫైలు మీదనే రెండో సంతకం పెడతానని ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు ఆమేరకు ఆదేశాలు ఇచ్చేసిన సంగతి తెలిసిందే.
కాకపోతే ఆ ఉత్తర్వులను.. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. ఈ నిర్ణయం ద్వారా.. తమ భూములు తమవి కాకుండా పోతాయనే భయంలో కొట్టుమిట్టాడిన తెలుగు ప్రజలకు అతిగొప్ప ఉపశమనం కలిగినట్లు అయింది.
లాండ్ టైటిలింగ్ కు సంబంధించి.. కేంద్రప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను తయారుచేసింది. తమాషా ఏంటంటే.. భాజపా పాలిత రాష్ట్రాలు కూడా ఈ మార్గదర్శకాల జోలికి వెళ్లలేదు. అయితే.. అసలు కేంద్రం చెప్పిన మార్గదర్శకాలకు సంబంధం కూడా లేకుండా.. అడ్డగోలు నిబంధనలు, విధివిధానాలతో జగన్మోహన్ రెడ్డి సర్కారు లాండ్ టైటిలింగ్ చట్టాన్ని తయారుచేసింది. భూమి హక్కు పత్రాల ఒరిజినల్స్ అసలు యజమాని దగ్గరే ఉండకుండా.. ఈ చట్టంలో మార్గదర్శకాలు తయారుచేశారు. కేవలం వారి వద్ద జిరాక్సు ప్రతులు మాత్రమే ఉండేలా నిబంధనలు పెట్టారు.
ఎవ్వరి భూమిని ఎవ్వరైనా విక్రయించేస్తారేమో.. కొన్నాళ్లు ఏమరుపాటుగా ఉంటే తమ భూమి తమకు తెలియకండానే పరాధీనం అయిపోయి ఉంటుందేమో.. అని ప్రతి ఒక్కరూ భయపడే విధంగా ఈ చట్టం రూపొందింది. దుర్మార్గమైన ఈ చట్టం గురించి తెలుగుదేశం కూటమి పార్టీలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి చైతన్యం తీసుకువచ్చాయి. మరోవైపు ఆ చట్టంతో తమ ప్రభుత్వానికి సంబంధమే లేదని, కేవలం కేంద్రం చెప్పిన చట్టాన్నే తీసుకువచ్చాం అని.. అదొక అద్భుతం అని సజ్జల రామక్రిష్ణారెడ్డి సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
కానీ ఆ కల్లబొల్లి కబుర్లను జనం నమ్మలేదు. చట్టంలోని తప్పుడు నిబంధనల్ని ఎండగడుతూనే.. తాము అధికారంలోకి రాగానే రెండో సంతకంతోనే ఈ చట్టం రద్దు చేసేస్తామనే హామీతో చంద్రబాబునాయుడు జనాన్ని ఆకట్టుకున్నారు. జనం ఆయన మీద నమ్మకం ఉంచారు. ఇప్పుడు కేబినెట్ ఆమోదం కూడా పూర్తిచేయడం ద్వారా చంద్రబాబు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.
చంద్రబాబు సెక్రటేరియేట్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే చేసిన అయిదు సంతకాలతో పాటు, రాష్ట్రంలో గంజాయి నియంత్రణకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన పెన్షన్లు, తిరిగి ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లు ప్రజల్ల హర్షామోదాలను పొందనున్నాయి.