బాబు సర్కార్ మాస్టర్ స్ట్రోక్ : అమరావతికి చట్టబద్ధత!

Friday, December 5, 2025

అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండాలని ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. అమరావతి ఒక్కటే రాష్ట్రానికి రాజధాని అనే ఎజెండాతోనే కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు అన్నీ ప్రజల ముందుకు వెళ్లి అద్భుతమైన విజయం సాధించాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పుడు దాదాపుగా లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభం కూడా అయ్యాయి. ప్రధాని చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడి పనులన్నీ మూడేళ్లలో పూర్తవుతాయని ప్రభుత్వం అంటోంది.

ఎన్ని జరుగుతున్నప్పటికీ.. ప్రజల మనసుల్లో ఒక చిన్న గుబులు కనిపిస్తోంది. పరిస్థితులు వికటించి ఒకవేళ మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే గనుక.. పరిస్థితి ఏమిటి? అనేదే ఆ గుబులు! ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే అమరావతి మీద అనల్పంగా విషం కక్కి, దానిని స్మశానంగా మార్చేయడానికి కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు పనులు జరగుతున్న తీరు చూసి ఓర్వలేకపోతున్నారన్నది నిజం.

ఇలాంటి నేపథ్యంలో ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇవన్నీ ఎక్కడివక్కడ ఆపేసి.. ఇది రాజధాని కాదు అని ప్రకటించడానికి కూడా అవకాశం ఉన్నదని పలువురు ఆందోళన చెందుతున్నారు. అయితే జగన్ చేయగల ఇలాంటి కుట్రలకు అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడం ఒక్కటే విరుగుడు అని పలువురు సూచిస్తున్నారు. కొన్నివారాలుగా వినిపిస్తున్న ఈ ఆలోచన దిశగా ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఏపీ పునర్విభజన చట్టాన్ని సవరించడం ద్వారా.. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని పార్లమెంటులో తీర్మానించాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ కేబినెట్ తీర్మానించింది.

ఏపీ విభజన చట్టంలో ఆంద్రప్దదేశ్ రాజధాని అనే స్థానంలో అమరావతి పేరు చేర్చాలనేది ఈ ప్రతిపాదన సారాంశం. ఈ మేరకు ఆ చట్టాన్ని సవరించాలని కోరుతూ చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు.
ఇటీవల కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. ముందు ముందు అమరావతి రాజధానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించే ఆలోచన చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కేంద్రం ద్వారా ఈ పని మరింత త్వరగా సాధించుకునేలా.. ఏపీ కేబినెట్ తీర్మానం చేయడం విశేషం. చట్టంలోనే అమరావతిని రాజధానిగా పేర్కొంటే గనుక.. ఇక జగన్ ఎన్నికుట్రలు చేసినా.. ఆ రాజధానిని ఏమీ చేయలేరని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles