చంద్రబాబు ఉచిత ఇసుక విధానం తీసుకువస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి పసలేని విమర్శలు చేశారు. ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయినప్పటికీ.. చంద్రబాబు ఇసుక విధానంలో ఎడాపెడా దోచుకుంటున్నారని, తమ ప్రభుత్వ హయాంలో ఇసుక దొరికిన ధరకంటె రెండు మూడు రెట్లు అధిక ధర పెడితే తప్ప ఇసుక దొరకడం లేదని రకరకాల ఆరోపణలు చేశారు. ఇసుక విధానం చూసి ప్రజలందరూ చంద్రబాబును తిట్టుకుంటున్నారని కూడా జగన్ నిందలు వేశారు. ఒకవైపు జగన్ ఇలాంటి బూటకపు నిందలు వేస్తూండగానే.. చంద్రబాబునాయుడు నిర్మాణరంగానికి పెద్దవరంలాగా ఇసుక విధానంలో మరొక సరికొత్త నిర్ణయాన్ని కూడా ప్రకటించారు.
ఇసుక కోసం ప్రజలు సీనరేజీ చెల్లించాల్సిన అవసరం కూడా లేదని తాజా నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇది నిర్మాణరంగానికి అతిపెద్ద మేలు అనడంలో సందేహమే లేదు. ఉచిత ఇసుక విధానాన్ని మరింత పక్కాగా అమలు చేసేందుకు,లభ్యత పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చంద్రబాబు వెల్లడించారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో తీసుకువెళ్లేవాళ్లు.. వాగులు, నదుల నుంచి ఎంత ఇసుక కావాలంటే అంత తీసుకువెళ్లవచ్చునని కూడా ప్రకటించారు. అలాగే లారీల్లో తీసుకువెళ్లే వాళ్లు 40 టన్నులకు మించి ఇసుక తీసుకెళుతుంటే అధికలోడ్ పేరుతో ఇదివరకు జరిమానాలు ఉండేవి. ఆ జరిమానాలను కూడా తొలగిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. కేవలం పంచాయతీలకు మాత్రమే జమ అయ్యే పన్నులు చెల్లిస్తే సరిపోతుంది. ఎంత ఇసుకనైనా ఉచితంగా తీసుకువెళ్లవచ్చు!
ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఉచితం అని ప్రకటిస్తున్నప్పటికీ.. తన జమానాలోకంటె రెండు మూడురెట్లు ధరలు పెంచేసి దోచుకుంటున్నారని నిరాధార ఆరోపణలు చేస్తుండగా, చంద్రబాబు సీనరేజీలు కూడా రద్దుచేస్తూ ఇసుకను మరింత అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయం. జగన్ కు ఇది చెంపపెట్టు లాంటి నిర్ణయం అని ప్రజలు అంటున్నారు. జగన్ నోటికి తాళాలు వేసినట్టుగా చంద్రబాబు అద్భుత నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
జగన్ చెబుతున్న మరో పంచనాత్మకమైన మాట కూడా ఉంది. ఇసుక విక్రయాల్లో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చేదని, ఇప్పుడు అది లేకుండాపోయిందని అంటున్నారు. దీనికి కూడా చంద్రబాబు అద్భుతమైన జవాబు ఇచ్చారు. ఇలా సీనరేజీ చార్జీలు కూడా రద్దు చేయడం వలన ప్రభుత్వానికి ఏడాదికి 200 కోట్ల రూపాయల భారం పడుతుందని, కానీ నిర్మాణరంగంలో పనులు వేగం పుంజుకోవడంతో పోలిస్తే ఆ భారం పెద్ద ఎక్కువేమీ కాదని ఆయన అంటున్నారు. నిర్మాణరంగ కార్యకలాపాలు పెరగడం వల్ల వచ్చే జీఎస్టీ రూపంలో ఆ నష్టం భర్తీ అవుతుందని కూడా అంటున్నారు. ఇక ప్రస్తుతానికి జగన్ నోటికి తాళం వేసుకుని, ఏ కొత్త పాయింటు దొరుకుతుందా.. కువిమర్శలు చేద్దామా అని వెతుక్కోవాల్సిందేనని ప్రజలు అనుకుంటున్నారు.
నిర్మాణరంగానికి బాబు వరం : జగన్ నోటికి తాళాలే!
Thursday, December 19, 2024