వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా పతనం అయిపోతున్నది. ఆ పార్టీలో ఉంటే తమకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో ఇప్పటికే పలువురు నాయకులు తమ దారి తాము చూసుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా దక్కిన చట్టసభల పదవులు కూడా కాదనుకుని మరీ ఆ పార్టీకి రాజీనామా చేసేస్తున్నారు. పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ రాజ్యసభ ఎంపీ ల జాబితాలో తొలుత పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డి పేరు కూడా వినిపించింది. జగన్ అతి ప్రయత్నం మీద పార్టీని వీడకుండా నిలబెట్టుకున్న నాయకుల్లో ఆయన ఒకరు. తర్వాత ఆయనకు కృష్ణాజిల్లా రీజనల్ కోఆర్డినేటర్ పదవి కూడా కట్టబెట్టారు.
అయోధ్య రామిరెడ్డి తాజాగా మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఓటమి సంభవించడం అనేది వాలంటీర్ల కారణంగానే జరిగిందని తేల్చిచెప్పారు. గత అయిదేళ్లలో ప్రభుత్వం వాలంటీర్ల మీద మాత్రమే దృష్టి పెట్టినందువల్ల ఎన్నికల్లో దెబ్బతిన్నాం అని ఆయన తీర్మానించారు. వాలంటీర్ల మీద డిపెండ్ అయి క్యాడర్ ను నిర్లక్ష్యం చేయడమే ఓటమికి దారి తీసిందని కూడా అయోధ్య రామిరెడ్డి సూత్రీకరించారు.
ఇదంతా బాగుంది గానీ.. ఆయన విమర్శలు వాలంటీర్లను తప్పుపడుతున్నట్టుగా లేవు. వారి మీద అతిగా ఆధారపడేలా పార్టీని నడిపించిన అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరిని తప్పుపడుతున్నట్టుగానే ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ల మీద అతిగా ఆధారపడడానికి ప్రధాన కారణం జగన్ వైఖరి. ఆయన వాలంటీర్ల వ్యవస్థ అనేది తన బ్రెయిన్ చైల్డ్ గా భావించారు. వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలోని లబ్ధిదారులు అందరినీ ప్రలోభపెట్టగలిగితే చాలు, భయపెట్టగలిగితే చాలు.. తాను శాశ్వతంగా ఎప్పటికీ సీఎంగా గెలుస్తూనే ఉంటానని ఆయన తలపోశారు. జగన్ సొంత డబ్బు ఇస్తున్నంత స్థాయిలో మీకు పెన్షన్లు జగనన్నే ఇస్తున్నాడు తెలుసా.. అంటూ ప్రతినెలా వాలంటీర్లతో ఊదరగొట్టించారు. చంద్రబాబు గెలిస్తే మీకు పెన్షన్లు రావు.. అని వారిని భయపెట్టించారు. వాలంటీర్లు చేస్తున్న మాయలు, సాముగరిడీలు చాలునని, ఇక పార్టీ కార్యకర్తలు అనవసరం అని జగన్ భావించారు. ఆ అహంకారం కారణంగానే ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది.
వాలంటీర్ల ద్వారా చేయగల మాయలను నమ్ముకుని.. ప్రజలను సొంత ఆలోచన ఉండని అవివేకులుగా భావించడం వల్లనే జగన్ దెబ్బతిన్నారు. ఆయన అహంకారం ఓటమి రూపంలో కూలిపోయింది. ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి మాటలు కూడా అదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
అయోధ్య ఎటాక్ జగన్ రెడ్డి మీదనే!
Sunday, December 22, 2024