వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ నాయకుల మధ్య లుకలుకలు ఉన్నాయి. ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకోవడం చాలా ప్రబలంగా ఉంది. ఇలాంటి విభేదాలు బాగా బయటపడిన కొన్ని నియోజకవర్గాల్లో ముఠాలను బుజ్జగించడానికి జగన్మోహన్ రెడ్డి, మరికొందరు పెద్దనాయకులు ప్రయత్నించారు. కొన్ని చోట్ల సద్దుమణిగాయి. మరికొన్ని చోట్ల నివురుగప్పిన నిప్పులు మండుతూనే ఉన్నాయి. మొత్తానికి ఎన్నికల వేళ కూడా దగ్గరకు వచ్చేస్తోంది. ఇలాంటి సమయంలో.. అభ్యర్థులతో కలసి పనిచేస్తూ వెనుక గోతులు తవ్వుతున్నది ఎవ్వరో.. నాయకులను కలుపుకుని పనిచేయించుకుంటూ వారిని చిన్న చూపు చూస్తున్నది ఎవ్వరో అంతా గందరగోళంగానే ఉంది. కాగా, దర్శి ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భార్య తమ నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నాయకుల పేర్లను ప్రస్తావించి మరీ వారి గురించి మాట్లాడిన ఒక ఆడియోకాల్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ‘వాళ్లను నమ్మి మేం ఎలక్షన్ చేయడం లేదు. ఈ రెండు నెలలు వాళ్లను భరించి తర్వాత పక్కన పెట్టేద్దాం. గెలిచిన తర్వాత ఎవడిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడదాం’ అంటూ బూచేపల్లి సతీమణి నందిని అన్నటువంటి మాటల ఆడియో ఇప్పుడు నియోజకవర్గంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
దర్శి నియోజకవర్గం సిటింగ్ ఎమ్మెల్యేను కాదని శివప్రసాద్ రెడ్డి తనకు టికెట్ దక్కించుకున్నారు. అక్కడ ఏఎంసీ మాజీ ఛైర్మన్ వెంకటరెడ్డి అలియాస్ మహేష్, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, రాష్ట్ర బ్యూటీ గ్రీనరీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి తదితరులతో బూచేపల్లికి విభేదాలున్నాయి. ప్రస్తుతానికి వాళ్లు ఎన్నికల్లో పనిచేస్తూనే ఉన్నారు. అయితే అభ్యర్థి బూచేపల్లి కుటుంబంలో వారి పట్ల ఎలాంటి అభిప్రాయం ఉన్నదో.. ఆయన భార్య మాటల్లో ఇవాళ బయటకు వచ్చింది. ఆ ఆడియో లీక్ తో దర్శి నియోజకవర్గ వైసీపీలో బూచేపల్లికి వ్యతిరేకవర్గం గరంగరంగా ఉంది.
ఒక నియోజకవర్గంలో పరిస్థితి ఇప్పుడిలా ఆడియో రూపంలో బయటపడింది. కానీ రాష్ట్రంలో ఇంకా అనేక నియోజకవర్గాల్లో వాతావరణం ఇదేమాదిరిగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వాడుకుని వదిలేద్దాం అనే ధోరణిలో అభ్యర్థులున్నారు. అసంతృప్త కేడర్ కూడా మనస్ఫూర్తిగా పనిచేయడం లేదు. మొత్తానికి ఇతరత్రా నియోజకవర్గాల్లో ఈ కొట్లాట గుంభనంగానే ఉన్నప్పటికీ.. బూచేపల్లి శ్రీమతి నందిని దర్శిలోని వ్యవహారాన్ని రోడ్డున పడేశారని, అక్కడ పార్టీ కేడర్ అంతా శివప్రసాద్ రెడ్డి మీద మండిపడుతూ ఓడించాలని చూస్తున్నారని ఇప్పుడు స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆడియో లీక్ : సీక్రెట్ చెప్పిన బూచేపల్లి శ్రీమతి!
Wednesday, January 22, 2025