ఏపీలోని ఉద్యోగులకు చంద్రబాబునాయుడు ఒక అద్భుతమైన వరాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో రెండు రోజుల కిందటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు ఓటు వేసే ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఉద్యోగులు అందరూ కూడా.. పండగ చేసుకునేలా చంద్రబాబు ప్రకటించిన హామీ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇంతకూ చంద్రబాబు ఇచ్చిన ఆ గొప్ప హామీ ఏంటో తెలుసా.. ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతినెల ఒకటో తేదీనాడే జీతాలు, పెన్షన్లు అందజేస్తా అని అంటున్నారు. ఒకటో తేదీ జీతాలు తీసుకోవడం అనేది కేవలం కథల్లో కనిపించే మాటగా అనుకుంటూ.. అయిదేళ్లుగా ఒకటో తేదీ జీతాలు తీసుకోవడం మరచిపోయిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా గొప్ప వరమే. ప్రతినెల ఒకటో తేదీ జీతాలు కాదు కదా.. అసలు నెలలో ఏ రోజు అందుతాయో కూడా తెలియకుండా ప్రతినెలా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఇది పెద్ద వరం కాక మరేమిటి?
చంద్రబాబునాయుడు ఒంగోలులో నిర్వహించిన ప్రచార సభలో ఈ హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ అమలుచేస్తాం అని కూడా చంద్రబాబు ప్రకటించారు. నిజానికి ఉద్యోగులు పీఆర్సీ అనే పదం వెంటే మురిసిపోవాలి. ముందే ఐఆర్ వస్తుందని సంతోషించాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిన రోజుల్లో పీఆర్సీ పేరిట ఉద్యోగుల జీతాల్లో కోతపడేలా నిబంధనలు రూపొందించిన వైనం కూడా వారు గమనించారు. జగన్ ఇచ్చిన అసహ్యకరమైన పీఆర్సీకి వ్యతిరేకంగా ఎంతపోరాడినప్పటికీ వారు సాధించిందేమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు ఉద్యోగుల కోసం ఈ వరుస హామీలు ప్రకటిస్తూ ఉండగా.. వారికి ఐఆర్, పీఆర్సీ అనే పదాలకంటె ఎక్కువగా.. ప్రతినెలా ఒకటోతేదీన జీతాలు అనే మాట తియ్యగా ధ్వనిస్తుండడం విశేషం.
ఇక్కడ ఒక సంగతి గమనించాల్సి ఉంది. ఆర్థిక వనరుల పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది. ఇవాళ జగన్ ప్రభుత్వం ఉన్నా, రేపు చంద్రబాబు ప్రభుత్వం వచ్చినా అప్పులు తెచ్చి వేతనాలు ఇవ్వాల్సిందే. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆస్తులమీద అప్పులు తేగల మార్గాలన్నీ వాడేశారు. చంద్రబాబు ఏవో కొత్త మార్గాలు చూసుకోకుండా పోరు. కాకపోతే ఉద్యోగుల సందేహం ఏంటంటే.. ప్రతినెలా అప్పుల మీదనే జీతాలు ఇస్తున్నప్పుడు ఆ అప్పులను ఒకటో తేదీలోకా పూర్తిచేసి.. ఆ తేదీనాటికి జీతాలు ఇస్తే ప్రభుత్వపెద్దలకు వచ్చే నష్టమేముంది అనేది వారి సందేహం. ఒక్కోనెల రెండోవారంలో కొన్ని సార్లు మరుసటి నెలలో జీతాలు డిపాజిట్ అయిన సందర్భాలు కూడా ఉంటున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మాత్రం.. అప్పులు తెచ్చి.. ప్రతినెలా ఒకటో తేదీనాటికి ఖచ్చితంగా డబ్బు పంపుతుండగా.. అవే అప్పులు ఇంకాస్త జాగ్రత్తగా తెచ్చి ఉద్యోగులకు కూడా ఒకటో తేదీన ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని వారు బాధపడుతున్నారు. ఈ లెక్కన చంద్రబాబు వస్తే జీతం కష్టాలు తీరుతాయని ఉద్యోగులు అనుకుంటున్నారు.
పోస్టల్ బ్యాలెట్ వేళ.. ఉద్యోగులకు చంద్రబాబు భలే వరం!
Wednesday, January 22, 2025