వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన చెల్లెలు షర్మిల కోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఆస్తులలో వాటాల కోసం, న్యాయంగా తన తండ్రి కోరిక మేరకు, తండ్రి సంపాదించిన ఆస్తులలో తన పిల్లలకు దక్కవలసిన హక్కు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నారు. కోర్టును ఆశ్రయిస్తే గనుక తల్లి విజయమ్మని ఆమె సాక్షిగా వాడుకోబోతున్నారు. ఆస్తుల పంపకానికి సంబంధించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయాన్ని ఆలోచనను తుంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని- ఆమె కోర్టు ద్వారా ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నవారు. ఈ విషయాన్ని రెండు పేజీల సుదీర్ఘమైన లేఖ ద్వారా ఆమె జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలియజేశారు. తల్లిని సాక్షిగా వాడుకోబోతున్న సంగతిని కూడా అదే లేఖలో హెచ్చరించారు. అందుకు నిరూపణగా అన్నకు జగన్ రాసిన లేఖలో రెండు పేజీల మీద కూడా విజయమ్మతో కూడా సంతకం చేయించి మరి ఆ లేఖ పంపడం ఒక సంచలనం.
వైయస్ రాజశేఖర్ రెడ్డి తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తులలో తన మనవలు నలుగురికి సమానంగా దక్కాలని ఆలోచించినట్లుగా షర్మిల ఆ లేఖలో పేర్కొన్నారు. తండ్రి వైయస్సార్ ఆదేశాలను శిరసావహిస్తానని అప్పట్లో మాట ఇచ్చి, ఆయన మరణించిన తర్వాత ఆ హామీని తుంగలో తొక్కిన జగన్మోహన్ రెడ్డి ఒక ఎం ఓ యు ద్వారా పేర్కొన్న ఆస్తులలో చాలా తక్కువ భాగం మాత్రమే వాటాలించినట్లుగా ఆమె ఇప్పుడు బయట పెడుతున్నారు. భారతి సిమెంట్స్, సాక్షిలలో మెజారిటీ వాటాలు జగన్ వద్దనే ఉంచుకున్నారని ఆరోపిస్తున్నారు. కేవలం కుటుంబం మీద ప్రేమ, రక్తసంబంధం కాపాడుకోవాలనే ఆలోచనతో మాత్రమే ఎమ్ఓయూ ద్వారా అన్యాయం జరిగినప్పటికీ అప్పట్లో అంగీకరించినట్లుగా చెబుతున్న షర్మిల- ఇవాళ తల్లిని, తనను కోర్టుకు లాగడం ద్వారా జగన్మోహన్ రెడ్డి దూకుడు ప్రదర్శించడంతో తాను కూడా న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తానని హెచ్చరించారు.
ఎంఓయూ ద్వారా ఇస్తానన్న పరిమితమైన ఆస్తులను కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి కుట్ర జరుగుతున్నదని షర్మిల ఆరోపించడం విశేషం. బెంగళూరులో 20 ఎకరాల్లో ఉన్న యెలహంక ప్యాలెస్ లో వాటాతో సహా ప్రతి విషయం తేల్చాల్సిందేనని షర్మిల హెచ్చరించారు.
అవినాష్ రెడ్డికి, భారతికి, జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని జగన్ చేసిన హెచ్చరికపై షర్మిల ఫైర్ కావడం గమనార్హం. తన రాజకీయ దృక్పథాన్ని జగన్ శాసించలేరని అంటున్నారు. ఇలాంటి అర్థం లేని నిబంధన విధిస్తే ఊరుకోమని కూడా హెచ్చరించారు. నైతికంగా దిగజారిపోయిన లోతులనుంచి పైకి రావాలని జగన్మోహన్ రెడ్డిని షర్మిల కోరడం విశేషం. ఈ అన్నాచెల్లెళ్ల మధ్య గొడవ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.
తల్లి సాక్షిగా, జగన్ పై న్యాయపోరాటానికి షర్మిల రెడీ!
Sunday, December 22, 2024