ఎవరికైనా గట్టి నామినేటెడ్ పోస్టులు దక్కినప్పుడు.. ఆ పదవిలో ఉన్నంత కాలం తాము సంపాదించుకోవడం మాత్రమే కాదు.. తమకు కావాల్సిన వారికి కూడా లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ లబ్ధి అనేది సంస్థను అయిన వారికి దోచిపెట్టే కాంట్రాక్టులరూపం దాలిస్తే అది దుర్మార్గం అవుతుంది. అదే సమయంలో.. ఏదో తమకు కావాల్సిన వారికి పొట్టనింపుకోవడానికి ఉద్యోగాలు, ఉపాధులు కల్పించడం వంటివైతే పెద్దగా అభ్యంతరపెట్టే పనిలేదు. లంచాలు ఆశించి ఉద్యోగాలు ఇవ్వనంత వరకు వాటిని చూసీ చూడనట్టు వదిలేయవచ్చు. కానీ.. తమకు కావాల్సిన వారిని సంస్థలో వివిధ హోదాల్లో ప్రవేశపెట్టడం వెనుక దుర్మార్గమైన ప్రణాళికలు, ముందస్తు వ్యూహాలు, ఎప్పటికీ సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే దురాలోచనలు, తమకు కిట్టని పరిస్థితి వస్తే సంస్థను భ్రష్టు పట్టించాలనే పన్నాగాలు ఉంటే దానిని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో అలాంటి భయాలే రేకెత్తుతున్నాయి. భూమన కరుణాకర రెడ్డి తాజా ప్రకటనతో టీటీడీ వర్గాలు విస్తుపోతున్నాయి. అప్రమత్తం అవుతున్నాయి. ముందుముందు సంస్థ పరువు ప్రతిష్ఠలను కాపాడాలాంటే.. భూమన కోవర్టులను ఏరిపారేయాలని భావిస్తున్నారు.
గోశాల నిర్వహణ గురించి రభస చేస్తున్న భూమన ఒక నిర్ఘాంతపరిచే విషయాన్ని బయటపెట్టారు. టీటీడీలో ఎప్పటికప్పుడు తనకు సమాచారం మోస్తూ ఉండే నిఘానేత్రాల వంటి రెండువేల మంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. గోశాల గురించి చూపించిన ఫోటోలు అబద్ధం కాదు అని చెప్పడానికి భూమన ఈ విషయాన్ని బయటపెట్టారు.
ఇప్పుడు టీటీడీ ఉద్యోగులు అందరిలోనూ తీవ్రమైన ఆందోళన నెలకొంది. భూమన నిఘానేత్రాలు అని చెప్పుకుంటున్న కోవర్టులు.. తిరుమల, తిరుపతిలల్లో వివిధవిభాగాల్లో తిష్ట వేసుకుని కూర్చుని ఉన్నారని వారు భయపడుతున్నారు. భూమన కళ్లలో ఆనందం చూడడానికి, ప్రభుత్వం మీద, ప్రస్తుత టీడీపీ యాజమాన్యం మీద నిరంతరం విమర్శలు చేస్తూ ఉండడానికి భూమనకు అవసరమైన ‘ఇన్ పుట్స్’ ఇవ్వాలనే దుగ్ధతో సదరు రెండువేల మంది కోవర్టులు తప్పుడు పనులు చేయడం మొదలెడితే.. సంస్థ పరువు ఏమౌతుందనే భయం పలువురిలో కలుగుతోంది. రెండు వేల మంది కోవర్టులను కలిగి ఉండడం చిన్న విషయం కాదు. చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే.. తిరుమలకు చేరుకోగల అన్ని రకాల మార్గాలూ బాగా తెలిసి ఉండే వాళ్లే రహస్యంగా కొన్ని లిక్కర్ సీసాలు తిరుమలకు తెచ్చి ఎక్కడో ఒక పబ్లిక్ ప్లేసులో వాటిని గుట్టుచప్పుడు కాకుండా వదిలేసి.. ఆ సీసాలను, మాంసం లాంటి వాటిని అక్కడ ఫోటోలు తీసి భూమనకు పంపితే పరిస్థితి ఏమిటి? ఆయన ఇంకో పెద్ద ప్రెస్ మీట్ పెట్టి తిరుమలలో విచ్చలవిడిగా లిక్కర్ దొరుకుతోందనే ఆరోపణలు చేయకుండా ఉంటారా? అనేది అందరి భయంగా ఉంది.
భూమన కళ్లలో ఆనందం కోసం ఆయన కోర్టులు ఇలాంటి తప్పుడు పనులతో భ్రష్టు పట్టించకుండా ఉండాలంటే.. అలాంటి వారిని ముందుగా ఏరివేయాలని అంటున్నారు. విధులనుంచి తొలగించడం సాధ్యం కాకపోతే దూరప్రాంతాలకు బదిలీలు చేయాలని కూడా సూచిస్తున్నారు. ఏదేమైనా సంస్థ పరువును కాపాడుకోవడం ముఖ్యకర్తవం అని అంటున్నారు.
ఏరేయండి : భూమన కోవర్టులతో పెనుప్రమాదం!
Sunday, April 27, 2025
