తమ పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భక్తులైన పోలీసు అధికారులు అత్యంత దారుణంగా వ్యవహరిస్తూ వచ్చిన తొలిరోజుల నుంచి నారా లోకేష్ రెడ్ బుక్ అనే ప్రస్తావన తెస్తున్నారు. ఆయన పాదయాత్ర రోజుల్లోనే తన వద్ద రెడ్ బుక్ లో తప్పుడు అధికారులు పేర్లన్నీ రాస్తున్నానని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని నారా లోకేష్ హెచ్చరించడం జరిగింది. అయితే.. ఇప్పుడు పరిణామాలను గమనిస్తూంటే రెడ్ బుక్ అనే పదానికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు నిజంగానే జడుసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. సాధారణ నాయకులు, కార్యకర్తలు అయితే ఒక ఎత్తు, సాక్షాత్తూ ఆ పార్టీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా రెడ్ బుక్ పేరు చెప్పి, తనకు ప్రాణభయం ఉన్నదని భద్రత కల్పించాలని కోర్టును ఆశ్రయించడం చూస్తే.. వారు ఇంతగా భయపడుతున్నారా? అనే అనుమానం కలుగుతోంది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలమూ.. కన్నూమిన్నూ కానకుండా చెలరేగిపోవడం మాత్రమే కాదు.. అహంకారంతోనూ విర్రవీగారు. రెడ్ బుక్ అంటూ నారా లోకేష్ మాట్లాడుతూ ఉంటే.. జగన్, ఆయన తైనాతీలు ఎద్దేవా, హేళన చేసేవారు. తీరా అధికారం చేతులు మారింది. జగన్ దళం రెడ్ బుక్ గురించి హేళన చేయడం మానేశారు. దాని బదులుగా, ఆ పదం చెబుతూ విమర్శించడం ప్రారంభించారు. రెడ్ బుక్ అంటూ అధికారుల్ని బెదిరిస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు తాము భయపడం అని కొన్నాళ్లూ అంటూ వచ్చారు. ఆ మాటల సీజను దాటిపోయింది. ఆ తర్వాత తమ పార్టీ కార్యకర్తలందరూ కూడా రెడ్ బుక్ లు రాస్తారని, తాను గుడ్ బుక్ కూడా రాస్తానని జగన్ ప్రాసలు, పంచ్ లు వేయడం ప్రారంభించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదంటూ జగన్ ఎన్నిసార్లు ఆందోళన వ్యక్తం చేశారో లెక్కేలేదు. ఈ మాటలను చూసి.. తాను అసలు ఇంకా రెడ్ బుక్ తెరవకుండానే జగన్ అంతగా భయపడుతున్నారా అంటూ నారా లోకేష్ ఎగతాళి చేయడం కూడా జరిగింది.
అయితే వైసీపీ నాయకులు రెడ్ బుక్ గురించి సీరియస్ గానే భయపడుతున్నారని అర్థమవుతోంది. మాజీ ఏఏజీ, ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో తనకు ప్రభుత్వం పోలీసు భద్రత కల్పించాలని కోరుతూ పిటిషన్ వేశారు. రెడ్ బుక్ లో తన పేరు చేర్చారని మీడియాలో కథనాలు వచ్చినందున భయంగా ఉన్నదని.. అందుచేత తనకు సెక్యూరిటీ కావాలని ఆయన కోరడం ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది. అక్కడికేదో రెడ్ బుక్ అనే ఒక కల్పనలాంటి పదాన్ని వేదప్రమాణంగా భావిస్తున్నట్టుగా, బూచిగా చూసి వైసీపీ అగ్రనేతలు కూడా జడుసుకుంటున్నట్టుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
‘రెడ్ బుక్’ అంటే అంత సీరియస్ గా భయపడుతున్నారా?
Saturday, January 18, 2025